ప్రధాన్ రాజీనామాపై వెనక్కి తగ్గని సీజేపీ.. దేశవ్యాప్త నిరసనలకు పిలుపు
ABN , Publish Date - Jul 24 , 2026 | 09:55 AM
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమం మరింత తీవ్రమైంది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ శుక్రవారం శాంతియుత నిరసనలు నిర్వహించాలని సీజేపీ పిలుపునిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమం మరింత తీవ్రమైంది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ శుక్రవారం శాంతియుత నిరసనలు నిర్వహించాలని సీజేపీ పిలుపునిచ్చింది. మరోవైపు ప్రతిష్ఠంభనకు ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ.. ప్రధాన్ రాజీనామాపై స్పష్టమైన హామీ లేకపోవడంతో ఉద్యమకారులు వెనక్కి తగ్గడం లేదు.
కాగా.. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం కూడా వేలాది మంది విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో చేరి నిరసనలు కొనసాగించారు. ట్రాఫిక్ ఆంక్షలు, మెట్రో స్టేషన్ల మూసివేత, భారీ పోలీసు బందోబస్తు మధ్యా ఆందోళనలు కొనసాగాయి. ఆ ప్రాంతంలో రెండో రోజూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయగా.. కన్నాట్ ప్లేస్‌లోని పలు వ్యాపార సంస్థలను ముందుగానే మూసివేశారు.
మరోవైపు.. నిరసనకారులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. జేపీ నడ్డాతో కలిసి సీజేపీ ప్రతినిధులతో అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. అయితే.. చర్చలు తటస్థ వేదికలోనే జరగాలన్న సీజేపీ.. జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయానికి రావాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ సందర్భంగా సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ.. 'మా ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే. ఆ విషయంలో ప్రభుత్వం తన స్పష్టమైన నిర్ణయం ప్రకటించాల్సిందే. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మేమూ వెనకడుగు వేయం. దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనల్లో ప్రజలు పాల్గొనాలి' అని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖలో రాత్రికి రాత్రే కీలక అధికారులను బదిలీ చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేస్తూ.. ఆయన స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్‌ను నియమించింది. పాఠశాల విద్యా శాఖ కార్యదర్శిగా టీకే అనిల్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.
ఇవీ చదవండి:
కన్నీరు పెట్టిస్తున్న విషాదం.. క్షణాల్లో కుటుంబాన్ని కబళించిన కొండచరియ..
భారత్, రుమేనియా దౌత్య సంబంధాల్లో నూతన అధ్యాయం