జవాబులకు బదులు బారికేడ్లు, లాఠీలా?
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:28 AM
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జి చేయడాన్ని పలువురు సినీ ప్రముఖులు, ఢిల్లీ, ముంబైకి చెందిన...
వ్యవస్థ విఫలమైనట్టే విద్యా వ్యవస్థ నాశనం
నీట్ ఆందోళనలపై కమల్ హాసన్
విద్యార్థుల డిమాండ్ వినాలి: సల్మాన్‌ఖాన్
అనిశ్చితిలో యువత.. బాధాకరం: దుల్కర్
బాధ్యులను శిక్షించాలి: మాధవన్
హైదరాబాద్, జూలై 23 : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జి చేయడాన్ని పలువురు సినీ ప్రముఖులు, ఢిల్లీ, ముంబైకి చెందిన న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, మాధవన్, దుల్కర్ సల్మాన్, ఇంతియాజ్ అలీ, అలియా భట్, అదితి రావ్ హైదారీ, కరీనా కపూర్, సోనాక్షి సిన్హా, పూజా భట్, గాయకుడు అర్జిత్ సింగ్ తదితర సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విద్యార్థులకు తమ మద్దతు ప్రకటించారు. సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు ఎదురైన అనుభవంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఓ పిల్లాడు ఏడ్చినప్పుడే మనం విని ఉండాల్సింది. అలా కాకుండా ఎంతోమంది పిల్లలు చనిపోయే దాకా వేచి చూశాం. చదువు స్థానంలో కోచింగ్, నేర్చుకోవాలనే తపన స్థానంలో ఆందోళన, ప్రతిభ స్థానంలో నేరప్రవృత్తి చేరి విద్యా వ్యవస్థ నాశనమైంది. సమాధానాలకు బదులు యువతకు బారికేడ్లు, లాఠీలు ఎదురయ్యాయంటే ఓ దేశం విఫలమైనట్టే’’ అని కమల్ పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులు తమ పని తాము చేశారని, దేశం తన బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైందని విద్యార్థులను ఉద్దేశించి కమల్ అన్నారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న సోనమ్ వాంగ్ చుక్ తన నిరశనను విరమించాలని కమల్ కోరారు. ప్రశ్నపత్రం లీకేజీ చాలా తీవ్రమైన సమస్య అని పేర్కొన్న సల్మాన్ ఖాన్.. మెరుగైన విద్యా వ్యవస్థ కోసం విద్యార్థులంతా ఏకతాటిపైకి వచ్చారని, ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్‌ను వినాల్సిందని పేర్కొన్నారు. దేశ యువత అనిశ్చిత పరిస్థితుల్లో ఉండడం బాధాకరమని దుల్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశంలో మెరుగైన విద్యా వ్యవస్థ ఉండాలన్న ఆర్.మాధవన్.. ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక, జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఘటనలు తనను కలచి వేశాయన్న నటి అదితిరావ్ హైదారీ... శాంతియుతమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు. నిజమైన ప్రతిభ, శ్రమకు గుర్తింపు లభించే విద్యా వ్యవస్థ విద్యార్థులకు అవసరమని నటి కరీనా కపూర్ పేర్కొన్నారు.
వీరితోపాటు సారా అలీ ఖాన్, అనన్య పాండే, ట్వింకిల్ ఖన్నా తదితరులు కూడా విద్యార్థులకు తమ మద్దతు ప్రకటించారు. ఇక, జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను న్యాయవాదులు కూడా ఖండించారు. శాంతియుత నిరసనకు దిగిన విద్యార్థులతో చర్చలు నిర్వహించకుండా హింసకు దిగడం ఆమోదయోగ్యం కాదని ఢిల్లీకి చెందిన 650 మంది న్యాయవాదులు ఓ ప్రకటన చేశారు. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసు చర్యని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, బాంబే బార్ అసోసియేషన్ కూడా ఖండించింది. ఆందోళనలు, నిరసనలను అడ్డుకునేందుకు మహారాష్ట్ర పోలీసులు ఇటీవల విధించిన ఆంక్షలను కూడా బాంబే బార్ అసోసియేషన్ తీవ్రంగా తప్పుబట్టింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు