Share News

భారత్, రుమేనియా దౌత్య సంబంధాల్లో నూతన అధ్యాయం

ABN , Publish Date - Jul 24 , 2026 | 08:57 AM

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రుమేనియా పర్యటన ఫలప్రదమైంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తూ మూడేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

భారత్, రుమేనియా దౌత్య సంబంధాల్లో నూతన అధ్యాయం
india romania target double bilateral trade in three years

బుకారెస్ట్ (రుమేనియా), జులై 24: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రుమేనియా పర్యటన ఫలప్రదంగా కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తూ, రాబోయే మూడేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు గాను మూడు ముఖ్యమైన రంగాల్లో ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. వీటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, విద్యా సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి.


ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, ఏడు దశాబ్దాలకు పైగా భారత్-రుమేనియాల మధ్య పరస్పర నమ్మకం, గౌరవంతో కూడిన బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. 'మా భాగస్వామ్యానికి ఆర్థిక సహకారమే ప్రధాన మూలస్తంభం. రాబోయే మూడేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించుకున్నాం. తయారీ రంగం, ఫార్మాస్యూటికల్స్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వ్యవసాయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరిస్తాం' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.


ఈ పర్యటన ఇరు దేశాల మధ్య బంధంలో ఒక నూతన శకానికి పునాది వేసిందని రుమేనియా అధ్యక్షుడు నికుషోర్ దాన్ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రెసిడెంట్ దాన్‌ను రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా ఆహ్వానించారు. అంతకుముందు బుకారెస్ట్‌లోని 'కోట్రోసేని ప్యాలెస్'లో రాష్ట్రపతి ముర్ముకు రుమేనియా అధ్యక్షుడు నికుషోర్ దాన్ ఘన స్వాగతం పలికారు.


ఇలా ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారం రోజుల పాటు చేపట్టిన యూరప్ పర్యటన రేపటితో ముగియనుంది. ఇందులో భాగంగా భారత రాష్ట్రపతి మోల్డోవా, ఉత్తర మాసిడోనియా దేశాల్లో పర్యటించారు. చివరిగా రుమేనియాలో పర్యటిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు

‘వందనం’తో తల్లికి ఆనందం

Updated Date - Jul 24 , 2026 | 09:56 AM