‘వందనం’తో తల్లికి ఆనందం
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:11 AM
రాష్ట్రవ్యాప్తంగా పోస్టాఫీసులు, బ్యాంకుల ముందు సందడే సందడి! ‘తల్లికి వందనం’ సొమ్ములు చూసుకుని తల్లులతోపాటు మొత్తం కుటుంబ సభ్యుల్లో ఆనందం నిండింది.
రెండో రోజూ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో బారులు
గంటలకొద్దీ వేచి ఉండి మరీ నగదు విత్‌డ్రా
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రవ్యాప్తంగా పోస్టాఫీసులు, బ్యాంకుల ముందు సందడే సందడి! ‘తల్లికి వందనం’ సొమ్ములు చూసుకుని తల్లులతోపాటు మొత్తం కుటుంబ సభ్యుల్లో ఆనందం నిండింది. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘తల్లికి వందనం’ డబ్బులు జమ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ నగదును విత్‌డ్రా చేసుకునేందుకు గురువారం రెండోరోజూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పోస్టాఫీసులు, బ్యాంకుల ముందు బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచే పోస్టాఫీసుల ముందు క్యూలు కనిపించాయి. మహిళలు వరుసలో నిల్చోగా... తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు గంటల తరబడి ఓపిగ్గా వేచి చూస్తూ కూర్చున్నారు. నగదు తీసుకున్న తర్వాత నోట్లను ఆనందంగా లెక్కపెట్టుకున్నారు. అనంతపురంలో గురువారం సుమారు 500 మంది మహిళలకు రూ.90 లక్షలు చెల్లించామని తపాలాశాఖ అధికారి శంకరయ్య తెలిపారు. గుంటూరులోని అరండల్‌పేట, కలెక్టరేట్ పోస్టాఫీస్‌ల వద్దకు పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకోవడం తో సిబ్బంది... ప్రత్యేకంగా క్యూలైన్లు పెట్టారు. విజయవాడలో ఏ బ్యాం కు వద్ద చూసినా తల్లులు పాస్‌బుక్కులు పట్టుకుని క్యూలో నిల్చున్న దృశ్యాలే కనిపించాయి. ‘సర్వర్లు స్లోగా ఉన్నాయి. రేపు రండి’ అని చెబుతున్నా... ‘మరే ం ఫర్లేదు. వెయిట్ చేస్తాం’ అని వేచి చూసి డబ్బులు తీసుకుని వెళ్లారు.