Share News

క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:34 AM

అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు ఏర్పాటుకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ముందుకొచ్చింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌లో క్వాంటం ఫైనాన్స్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేసేందుకు ఏపీ క్వాంటం మిషన్‌, పీఎన్‌బీ మధ్య ఒప్పందం కుదిరింది.

క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు

  • పీఎన్‌బీ క్వాంటం ఫైనాన్స్‌ ఇన్నోవేషన్‌ హబ్‌

  • ప్రభుత్వం, పీఎన్‌బీ ఎంవోయూ

అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు ఏర్పాటుకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ముందుకొచ్చింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌లో క్వాంటం ఫైనాన్స్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేసేందుకు ఏపీ క్వాంటం మిషన్‌, పీఎన్‌బీ మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, పీఎన్‌బీ సీఈవో, ఎండీ అశోక్‌ చంద్ర సమక్షంలో గురువారం ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలో బ్యాంకింగ్‌ రంగం కోసం ప్రత్యేకంగా క్వాంటం ఫైనాన్స్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న మొట్ట మొదటి బ్యాంక్‌గా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నిలిచింది. బ్యాంకింగ్‌ సేవల్లో సైబర్‌ భద్రతను పటిష్ఠం చేయడంతో పాటు ఆర్థిక మోసాలను ముందుగా గుర్తించే వ్యవస్థ ఏర్పాటుకు, భవిష్యత్‌ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థల్ని సురక్షితంగా నిర్వహించేందుకు పీఎన్‌బీ ఈ క్వాంటం ఫైనాన్స్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తోంది. కాగా, అమరావతిని క్వాంటం సహా డీప్‌ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చాలని సంకల్పించినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిజిటల్‌ అరెస్టు, సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయడంలో టెక్నాలజీ మరింత విస్తృతమవ్వాలని పీఎన్‌బీ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. డిజిటల్‌ బ్యాంకింగ్‌ను మరింత పటిష్ఠంగా అందించేలా క్వాంటం ఫైనాన్స్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు పీఎన్‌బీ సీఈవో, ఎండీ అశోక్‌ చంద్ర ముఖ్యమంత్రికి వివరించారు.


డిసెంబరు నాటికి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కేంద్రం: సీఎం

క్వాంటమ్‌ పరిశోధనలకు అమరావతి అత్యుత్తమ కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో గురువారం గ్లోబల్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కంపెనీ క్వాంటినమ్‌ సీఈవో రాజీబ్‌ హజ్రా సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబరు నాటికి అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కేంద్రం పని చేయడం ప్రారంభిస్తుందని ప్రకటించారు. ఇప్పటికే టెస్టింగ్‌ ఫెసిలిటీలు అమరావతిలో ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రాజీబ్‌ హజ్రా బృందానికి రాష్ట్రంలో క్వాంటమ్‌ వ్యాలీలో చేపట్టనున్న వినూత్న కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ప్రపంచస్థాయి ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు రాజీబ్‌ హజ్రా, రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ మధ్య సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఏఐ, అడ్వాన్స్‌డ్‌ క్వాంటమ్‌ ఎకోసిస్టమ్‌ను తీసుకురావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీబ్‌ హజ్రాకు సూచించారు.

Updated Date - Jul 24 , 2026 | 05:35 AM