Share News

2002 వివరాలు లేకుండానే..25 శాతానికి పైగా ఫారాల సమర్పణ

ABN , Publish Date - Jul 24 , 2026 | 10:09 AM

హైదరాబాద్‌ మహానగరంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) కొందరు ఓటర్లను ఆందోళనకు గురి చేస్తోంది.

2002 వివరాలు లేకుండానే..25 శాతానికి పైగా ఫారాల సమర్పణ
Telangana SIR survey

  • ఓటు హక్కు ఉంటుందా..? లేదా..?.. ఆందోళనలో కొందరు ఓటర్లు

  • గత వివరాలు లేకుంటే నోటీసులు.. నిర్ణీత డాక్యుమెంట్లు సమర్పిస్తే ఓటు

  • 2002లో ఓటున్నా కనిపించని వివరాలు.. మేమేం చేయలేమంటున్న బీఎల్‌ఓలు

  • ‘ఆంధ్రజ్యోతి’ నమూనా సర్వేలో గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ: మహానగరంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) కొందరు ఓటర్లను ఆందోళనకు గురి చేస్తోంది. 2002 ఓటరు జాబితా వివరాలు అందుబాటులో లేకపోవడం, ఎస్‌ఐఆర్‌ ఎన్యుమరేషన్‌ ఫారలో నమోదు చేయకపోవడంతో జాబితాలో పేరు ఉంటుందా? లేదా? అని మదనపడుతున్నారు. దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నా.. అప్పటి సమాచారం లేకపోవడం ఓటు హక్కుకు ముప్పు గా మారుతుందా..? అని ఆందోళన చెందుతు న్నారు. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. ఎన్యుమరేషన్‌ ఫారాలు అందాయా? బీఎల్‌ఓలకు ఫారం సమర్పించారా? ఫారంలో 2002 వివరాలు నమోదు చేశారా? అన్న ప్రశ్నలపై 1000మంది ఓటర్ల అభిప్రాయాలు సేకరించింది. ఇందులో 80 శాతానికిపైగా ఫారాలు తీసుకున్నామని చెప్పగా.. వారిలో మెజార్టీ సమర్పించినట్టు పేర్కొన్నారు. 2002 జాబితాలోని వివరాలు సమర్పించలేదని 25 శాతం మందికిపైగా చెప్పారు.


ఇతర రాష్ర్టాల్లో ఉన్న వారు..

2002లో ఓటు ఉన్న వారి వివరాలు ప్రస్తుతం ఆ జాబితాలో కనిపించడం. లేదు. అప్పటి ఎపిక్‌ కార్డు నెంబర్‌, ఏ నియోజకవర్గం? ఏ ప్రాంతం? పోలింగ్‌ కేంద్రంలో ఉన్నామనే వివరాలు చెప్పే పరిస్థితి లేకపోవడంతో జాబితాలో పేరు గుర్తించడం కష్టంగా మారుతోంది. పేర్ల ఆధారంగా వెతికినా.. కొందరి సమాచారం లభించడం లేదని బీఎల్‌ఓలు చెబుతున్నారు. దీంతో వారి వివరాలూ ఫారంలో నమోదు చేయలేకపోతున్నారు. ఇదిలా ఉంటే కొందరు 2002 ఓటర్‌ జాబితాలోని వివరాలు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు.


ఓటర్‌ లేదా వారి తల్లిదండ్రులకు అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐటీ కారిడార్‌లోని ఓ ప్రముఖ గేటెడ్‌ కమ్యూనిటీలో ఉండే ఓటర్‌ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘2002లో మా తల్లిదండ్రుల ఓటు వేరే రాష్ట్రంలో ఉంది. ఆ వివరాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే కేవలం నా సమాచారం పూరించి ఫారం సమర్పించాను. నోటీసులు ఇస్తే అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తా. అప్పటికీ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ) ఆమోదించకపోతే కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేస్తా’ అని చెప్పారు.


ముసాయిదా ప్రకటన.. నోటీసుల జారీ...

ఎస్‌ఐఆర్‌ ఓటర్‌ ముసాయిదా జాబితా ఆగస్టు 10వ తేదీన ప్రకటిస్తారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించే సమయంలో ఫారంలో 2002 ఓటర్‌ వివరాలు సమర్పించని వారికి నోటీసులిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల/డాక్యుమెంట్లలో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. దానిని పరిశీలించి.. సక్రమంగా ఉందని భావిస్తే ఈఆర్‌ఓ ఆమోదిస్తారు. వారి పేరు అక్టోబరు 12వ తేదీన ప్రకటించే తుది జాబితాలో ఉంటుంది. సరైన వివరాలు సమర్పించని పక్షంలో ఓటరు పేరు జాబితా నుంచి తొలగిస్తారు. ‘మున్ముందు ఓటర్‌గా పేరు నమోదు చేసుకోవడం ఇంతకుముందులా సులువుగా ఉండదు. 2026 ఎస్‌ఐఆర్‌ జాబితాలోని ఓటర్ల వివరాలు సమర్పించాలనే నిబంధనల పెట్టే అవకాశం ఉంది’ అని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారొకరు తెలిపారు.


ఏం చేయాలి?

గత ఎస్‌ఐఆర్‌ 2002లో జరిగింది. అనంతరం విడుదల చేసిన తుది జాబితాలో పేరున్న వారికి 2003లో ఓటరు గుర్తింపు కార్డులు(ఎపిక్‌) ఇచ్చారు. దాదాపు 24 సంవత్సరాల అనంతరం ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ జరుగుతోంది. ఈ క్రమంలో అర్హుల పేర్లు జాబితాలో ఉండేలా అనర్హులను తొలగించేలా ప్రక్రియ జరుగుతోంది. ఇందుకోసం 2002 జాబితాలోని వివరాలతో ప్రస్తుత ఓటర్ల వివరాలు మ్యాపింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుత ఓటరు జాబితా ఆధారంగా ఎస్‌ఐఆర్‌ ఫారాలు ముద్రించి బీఎల్‌ఓల ద్వారా ఓటర్లకు పంపిణీ చేశారు. ఈ క్రమంలో పూర్తి వివరాలతో ఓటర్లు పూరించిన ఫారాలు సమర్పించాల్సి ఉంటుంది.


  • ఓటర్‌కు 2002 జాబితాలో పేరుంటే ఆ వివరాలు ఎన్యుమరేషన్‌ ఫారంలో రాయాల్సి ఉంటుంది. ఎపిక్‌ కార్డు నెంబర్‌ లేని పక్షంలో అప్పటి అసెంబ్లీ నియోజకవర్గం, పోలిగ్‌ కేంద్రం నెంబర్లు, జాబితాలోని పార్ట్‌/సీరియల్‌ నెంబర్‌ రాయాలి.

  • 2002 జాబితాలో పేరు లేని ఓటర్లు.. అప్పటి జాబితాలోని వారి తల్లిదండ్రులు, గ్రాండ్‌ పేరెంట్స్‌ సమాచారం సమర్పించాలి. 40 యేళ్లలోపు ఉండి ఇప్పటికే ఓటరుగా పేరు నమోదై ఉన్న వారు మ్యాపింగ్‌ కోసం తప్పకుండా తల్లిదండ్రులు/గ్రాండ్‌ పేరెంట్స్‌ వివరాలు ఇవ్వాల్సిందే.

  • నగరంలో కొందరు ఓటర్లు తల్లిదండ్రులు/గ్రాండ్‌ పేరెంట్స్‌ వివరాలు ఫారంలో నమోదు చేయడం లేదు. ఫారం మూడో కాలమ్‌లో పుట్టిన తేదీ, మొబైల్‌ నెంబర్‌, తల్లిదండ్రులు/భాగస్వామి పేర్లు వంటి సమాచారం ఇస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు సైజులో రేషన్‌ కార్డు

మాకు సంబంధం లేదు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 10:09 AM