మాకు సంబంధం లేదు
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:14 AM
కాళేశ్వరం బ్యారేజీలలో నీళ్లు నింపడమనేది తమకు సంబంధం లేని అంశమని కేంద్రం స్పష్టం చేసింది. కాళేశ్వరం బ్యారేజీలలో నీళ్లను నింపడం, నింపకపోవడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమని పేర్కొంది.
బ్యారేజీల్లో నీళ్లు నింపడం రాష్ట్ర పరిధిలోని అంశం
బ్యారేజీల భద్రత, పునరుద్ధరణపైనే ఎన్డీఎస్ఏ సూచనలు చేస్తుంది
బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టీకరణ
కిషన్‌రెడ్డి నేతృత్వంలో పాటిల్‌తో ఎంపీల సమావేశం
న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీలలో నీళ్లు నింపడమనేది తమకు సంబంధం లేని అంశమని కేంద్రం స్పష్టం చేసింది. కాళేశ్వరం బ్యారేజీలలో నీళ్లను నింపడం, నింపకపోవడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన భేటీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టత ఇచ్చారు. గురువారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్, గోడం నగేశ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణామోహన్‌రావు తదితరులు ఢిల్లీలో సీఆర్ పాటిల్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు, ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లివ్వడానికి ఏమైనా మార్గం ఉందా? జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) నివేదిక తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం బ్యారేజీల భద్రత, పునరుద్ధరణపై ఎన్డీఎస్ఏ సూచనలు మాత్రమే చేస్తుందని.. నీళ్లు నింపే అంశం తమ పరిధిలోకి రాదని బీజేపీ ఎంపీలకు సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. ఈ భేటీ అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌తో కలిసి ఎంపీలు రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడారు.
ప్రశ్నార్థకంగా లక్ష కోట్ల కాళేశ్వరం..
రాష్ట్రంలో తాగుకు, సాగుకు నీళ్లు లేని గడ్డు పరిస్థితులు రాబోతున్నాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాళేశ్వరాన్ని కట్టి అవినీతికి పాల్పడినవాళ్లు, వారిని కాపాడుతున్నవాళ్లు ఇప్పుడు తమను ప్రశ్నించడం ఏమిటని నిలదీశారు. మూడు బ్యారేజీలను పూర్తిగా పరిశీలించి, అవసరమైన చోట మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ సూచించిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో కాళేశ్వరం అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమిటని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, కేటీఆర్ దోచుకున్న సొమ్ములోంచి ఇప్పుడు సీఎం రేవంత్ ఎంత తీసుకున్నారు? రాహుల్ గాంధీకి ఎంత ఇచ్చారో చెప్పాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్, కేసీఆర్ కలిసి నాటకాలు ఆడుతున్నారని.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రైతుల కడుపు కొడుతున్నారని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. ఎన్డీఎస్ఏ పేరుతో బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నీట్ ప్రశ్నపత్రాలను కొందరు తమ కుటుంబాలు, సంస్థల కోసం దొంగతనం చేశారని.. అది లీకేజీ కిందకు రాదని పేర్కొన్నారు. రాజు బలవంతుడైనప్పుడు దొంగలంతా ఏకమవుతారని.. ఇప్పుడు అదే మాదిరిగా అంతా ఏకమై ధర్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.