Share News

డెస్క్‌ జాబ్‌ చేస్తున్నారా? రోజుకు 5 నిమిషాలు ఈ 7 వ్యాయామాలు చేస్తే చాలు!

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:17 AM

గంటల తరబడి కూర్చుని చేసే డెస్క్‌ ఉద్యోగాలు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. శరీరంలో కదలికలు తగ్గిపోవడంతో భుజాల నొప్పి, వెన్నునొప్పి, అలసట, అధిక రక్తపోటు, డయాబెటీస్‌ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

డెస్క్‌ జాబ్‌ చేస్తున్నారా? రోజుకు 5 నిమిషాలు ఈ 7 వ్యాయామాలు చేస్తే చాలు!
Desk Job Exercises

గంటల తరబడి కూర్చుని చేసే డెస్క్‌ ఉద్యోగాలు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. శరీరంలో కదలికలు తగ్గిపోవడంతో భుజాల నొప్పి, వెన్నునొప్పి, అలసట, అధిక రక్తపోటు, డయాబెటీస్‌ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు వాటికి పరిష్కారం చూపుతాయంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. ఐదు నిమిషాల బ్రేక్‌

సమయంలో వాటిని చేస్తే చాలు. అవేమిటంటే...

- ఎక్కువసేపు కంప్యూటర్‌ స్ర్కీన్‌ను చూడ టం వల్ల మెడ కండరాలు బిగుసుకు పోతాయి. కాబట్టి కుర్చీలో నిటారుగా కూర్చుని, రెండు పాదాలను నేలపై ఆనించాలి. తలను నెమ్మదిగా కుడివైపునకు వంచాలి. భుజాలను వదులుగా ఉంచాలి. అదే భంగిమలో 15 నుంచి 20 సెకన్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమవైపు కూడా అలాగే చేయాలి. దాంతో మెడ కండరాలపై ఏర్పడే ఒత్తిడి తగ్గిపోతుంది.


book5.2.jpg

  • డెస్క్‌ జాబ్‌ వల్ల భుజాలు ముందుకు వంగిపోతాయి. ఫలితంగా భుజాల నొప్పి, మెడనొప్పి మొదలవుతుంది. ఈ ఇబ్బంది నుంచి బయటపడేందుకు కుర్చీలో నుంచి లేచి కాసేపు నిలబడాలి. భుజాలను పైకి ఎత్తాలి. ఆ తర్వాత భుజాలను వెనుక వైపునకు, ముందు వైపునకు గుండ్రంగా తిప్పాలి. ఈ వ్యాయామం భుజాల కదలికను మెరుగుపరుస్తుంది.


book5.3.jpg

  • ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చుంటే వెన్నునొప్పి పుడుతుంది. అలాంటప్పుడు కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. ఎడమ చేతిని కుడి కాలుపై ఉంచాలి. ఇప్పుడు శరీరాన్ని నెమ్మదిగా కుడివైపునకు తిప్పాలి. ఈ భంగిమలో 20 సెకన్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమవైపునకు కూడా ఇదే విధంగా చేయాలి. ఈ వ్యాయామం వెన్నె ముక కదలికను మెరుగుపరచి, నడుము భాగంలో ఏర్పడే బిగుతును తగ్గిస్తుంది.


book5.4.jpg

  • ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్ల కండ రాల కదలిక తగ్గుతుంది. కుర్చీలో నిటారుగా కూర్చుని ఒక కాలును నెమ్మదిగాముందుకు చాపి నేలకు సమాంతరంగా పైకి ఎత్తాలి. 20 సెకన్ల పాటు అలాగే ఉంచాలి. తర్వాత మరో కాలుతో కూడా చేయాలి. ఈ వ్యాయా మంతో తొడ కండరాలు రిలాక్స్‌ అవుతాయి. కాళ్లలో రక్త ప్రసరణ మెరుగవుతుంది.


  • ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం వల్ల తుంటి భాగంలోని కండరాలు బిగుసు కుపోవచ్చు. కుర్చీ అంచున కూర్చుని, కుడి కాలును ఎడమ మోకాలిపై ఆనించాలి. వీపును నిటారుగా ఉంచాలి. తుంటి భాగంలో సాగదీతగా నెమ్మదిగా ముందుకు వంగాలి. సుమారు 20 సెకన్ల పాటు అదే భంగిమలో ఉండాలి. ఆ తర్వాత మరో కాలుతో కూడా చేయాలి. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల బిగుసుకు పోయే తుంటి, పిరుదుల కండరాలను సాగదీయ డానికి ఈ వ్యాయామం సాయపడుతుంది.


book5.5.jpg

  • కాళ్లు, మడమలు కాస్త రిలాక్స్‌ అయ్యేందుకు కుర్చీ వెనుక నిలబడి బ్యాలెన్స్‌ కోసం కుర్చీని తేలికగా పట్టుకోవాలి. మడమలను నెమ్మదిగా నేల నుంచి పైకి లేపాలి. కాసేపు అదే స్థితిలో ఉండాలి. ఆ తర్వాత మడమలను నెమ్మదిగా కిందికి దించాలి. ఇది కాళ్ల కండరాలకు మంచి వ్యాయామం.

  • డెస్క్‌ పుషప్స్‌ మరొక మంచి ఆప్షన్‌. ఇందు కోసం డెస్క్‌పై రెండు చేతులను ఆనించాలి. రెండు పాదాలను వెనక్కి జరిపినిలబడాలి. ఛాతీ భాగాన్ని నెమ్మదిగా చేతుల వైపు తీసుకెళ్లాలి. ఆ తర్వాత చేతులతో తోస్తూ తిరిగి మొదటి స్థితికి రావాలి. ఈ వ్యాయామం ఛాతీ, భుజాలు, చేతులు, పొత్తికడుపు చుట్టూ ఉండే కండరాలు చురుకుగా పనిచేసేలా చేస్తుంది.


రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఈ 5 నిమిషాల వ్యాయామాలు చేయడం ద్వారా... ఉపశమనం పొందొచ్చు. పని మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ శరీరాన్ని కదిలించడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మెడను తిప్పడం - 40 సెకన్లు

భుజాలను తిప్పడం - 30 సెకన్లు

కూర్చుని వెన్నెముకను తిప్పడం - 40 సెకన్లు

కాళ్లను ముందుకు చాపడం - 60 సెకన్లు

తుంటి కండరాలను సాగదీయడం- 40 సెకన్లు

మడమలను పైకి లేపడం - 40 సెకన్లు

డెస్క్‌ పుషప్స్‌ - 50 సెకన్లు

మొత్తం సమయం - సుమారు 5 నిమిషాలు


ఈ వార్తలు కూడా చదవండి:

అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!

ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 11:24 AM