అతడి చీర కట్టు... అదుర్స్!
ABN , Publish Date - Nov 29 , 2026 | 10:32 AM
చీర కట్టడం ఆడవాళ్లకు మాత్రమే తెలిసిన విద్య అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలే తివ్యన్ జయరూబెన్ అనే కుర్రాడితో చీర కట్టించుకోవాలని ముచ్చట పడుతుంటారు.
చీర కట్టడం ఆడవాళ్లకు మాత్రమే తెలిసిన విద్య అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలే తివ్యన్ జయరూబెన్ అనే కుర్రాడితో చీర కట్టించుకోవాలని ముచ్చట పడుతుంటారు. శారీ డ్రేపింగ్‌లో మనోడికి తిరుగులేదు. సమంత, త్రిష, స్నేహ... ఈ లిస్టులో ఇటీవల హీరోయిన్ మృణాళిని రవికి పెళ్లిచీర కట్టిన ఈ పాతికేళ్ల కుర్రాడి డ్రేపింగ్ ప్రయాణం అతడి మాటల్లోనే...
‘‘పెళ్లిలో ఒకప్పుడు చీర కట్టాలంటే... తల్లి, చుట్టాలు, స్నేహితులు తోడుండేవాళ్లు. శారీ డ్రేపింగ్ ట్రెండ్ వచ్చాక... బ్యూటీపార్లర్‌కి వె ళ్లడం, మండపం దగ్గర చీర కట్టించుకోవడం చేసేవారు. అయితే ఈ పనంతా ఆడవాళ్లే చేసేవాళ్లు. ఇదే వృత్తిని (శారీ డ్రేపింగ్) మగవాళ్లెందుకు చేయకూడదనిపించింది. చీర కట్టడం అంటే కేవలం ఒక వస్త్రాన్ని శరీరం చుట్టూ చుట్టుకోవడం కాదు. శరీరాకృతికి తగ్గట్టుగా చీరను అమర్చడం, ప్లీట్స్‌ను సమంగా పెట్టడం, పల్లూను అందంగా తీర్చిదిద్దడం.
బాల్యంలోనే మొదలు...
చిన్నతనంలో మా అమ్మ చుడీదారులు ఎక్కువగా వేసుకునేది. ఎందుకంటే... సరిగ్గా చీర కట్టుకోవడం రాదని చెప్పేది. మా పిన్ని మాత్రం చీరలు బాగా కట్టుకునేది. అందుకే తన దగ్గరకు వెళ్లి టెక్నిక్స్ నేర్చుకున్నా. ప్రతీరోజూ ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేశా. ఒకరోజు అమ్మతో నేను చీర కడతానని చెప్పాను. ఆమె సరేనంది. ఆ సమయంలో నా సంతోషం అంతా ఇంతా కాదు. అలా రోజూ అమ్మకు చీర కట్టడంలో సాయం చేసేవాడిని. విషయం తెలుసుకొని పండుగలకు నా కజిన్స్ నాతోనే చీర కట్టించుకునేవారు. అలా మొదలైన సరదా వృత్తిగా మారుతుందని అనుకోలేదు.
ఐదు వేల మందికి...
చీర కట్టడంలో నైపుణ్యం ఉన్నవారు చాలామందే ఉంటారు. కానీ దాన్నే కెరీర్‌గా మార్చుకోవడం అంత సులువేం కాదు. నా అభిరుచినే నేను వృత్తిగా ఎంచుకున్నా. ఒక్కో చీరకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చీరలోని రంగులు, బోర్డర్, ఫ్యాబ్రిక్, బ్లౌజ్ డిజైన్‌కు అనుగుణంగా డ్రేపింగ్ పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆరుగజాల చీరను అందంగా కట్టడమే కాకుండా, దాని సంప్రదాయ అందం చెడిపోకుండా... ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దడంలో నేర్పరిని. వధువయినా, కాబోయే తల్లయినా.. సందర్భాన్ని బట్టి వారికి చీర కడతా. చీర ఒక్కటే కాదు... బ్లౌజ్, నగలు, మేకప్, జుట్టు అన్నీ వారిని హైలైట్ చేసేలా ఉండాలనుకుంటా. అందుకే నా క్లయింట్స్‌తో నా ప్రయాణం... రెండు నుంచి మూడు నెలలు ఉంటుంది. మొదట్లో అసలు శారీ డ్రేపింగ్‌కి పిలుస్తారా? అనుకున్నా. కానీ పెళ్లికొడుకులే తమకు కాబోయే భార్యకు అందంగా చీర కట్టమని నన్ను సంప్రదిస్తుంటారు. అదీ నా అచీవ్‌మెంట్. అలా... ఇప్పటిదాకా ఐదువేల మందికి పైగా చీర కట్టాను.
అంతర్జాతీయ ప్రయాణం..
సినిమా వేడుకలు, ఫొటోషూట్లు, ప్రత్యేక కార్యక్రమాల్లో హీరోయిన్లు ధరించే చీరలు ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంటాయి. అలాంటి వేడుకల్లో చీరకట్టులో చిన్న పొరపాటు జరిగినా మొత్తం లుక్‌ను మార్చేస్తుంది. అందుకే సెలబ్రిటీల స్టయిలింగ్‌లో శారీ డ్రేపింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. చీరకు ప్లీట్స్ ఎలా పెట్టాలి? కొంగు ఎలా సెట్ చేయాలి? వంటి అంశాలపై దృష్టి పెడతా. ఒక్కో హీరోయిన్ శరీరాకృతి, ధరించే చీర రకం, కార్యక్రమం స్వభావాన్ని బట్టి డ్రేపింగ్ స్టయిల్‌ను ఎంచుకుంటా. సమంత, త్రిష, స్నేహ, ప్రియమణి, చిన్మయి వంటి ఎంతోమంది సెలబ్రిటీలకు నేను చీరలు కట్టాను. సమంత కు 14 కిలోల బరువున్న ఒక ఫ్యాన్సీ చీర కట్టడం సవాలుగా నిలిచింది. దాన్ని స్టయిలిష్‌గా కట్టి ఆమె ప్రశంసలు అందుకున్నా. సినీ నటి స్నేహ భర్త ప్రసన్నకు చీరనే పంచెలా కట్టడం మర్చిపోలేని అనుభూతి.
అమ్మ సపోర్ట్ వల్లే...
ఒక మగాడు చీరలు కట్టడం, దాన్ని వృత్తిగా ఎంచుకోవడంపై రకరకాలుగా మాట్లాడుతారు. మొదట్లో అందరూ నన్ను వింతగా చూసేవారు. ఎగతాళి చేసేవారు. అప్పుడు అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది. తనే నాకు పెద్ద సపోర్టర్. ఏదైనా కొత్త స్టైల్ ట్రై చేయడానికి అమ్మే నా మోడల్. ఒక్కో శారీ డ్రేపింగ్‌కు రూ. 20వేల దాకా చార్జ్ చేస్తా. శారీ డ్రేపింగ్‌లో శిక్షణ కూడా ఇస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లతో కలిపి పదివేల మందికి పైగా నా దగ్గర చీర కట్టడం నేర్చుకున్నారు. సమాజం ఏమనుకున్నా...
నా కళే నాకు గుర్తింపు.’’
ఈ వార్తలు కూడా చదవండి:
అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!
ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...
Read Latest AP News And Telangana News And International News And Telugu News