ఈ బీచ్‌లకు తిరుగులేదు!
ABN , Publish Date - Nov 29 , 2026 | 09:17 AM
సాగర తీరాన... ఇసుక తిన్నెల్లో కూర్చుని, చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ, దిగంతాన్ని చూస్తూ కాసేపు కాలాన్ని మరచిపోతే... అద్భుతం కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాల పొడవునా లెక్కలేనన్ని బీచ్‌లు.
సాగర తీరాన... ఇసుక తిన్నెల్లో కూర్చుని, చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ, దిగంతాన్ని చూస్తూ కాసేపు కాలాన్ని మరచిపోతే... అద్భుతం కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాల పొడవునా లెక్కలేనన్ని బీచ్‌లు. ఇంతకీ ఏ బీచ్ బెస్ట్ అన్నదే ప్రశ్న. ఇటీవల ‘గ్లోబల్ బీచ్ ఇండెక్స్ 2026 సర్వే’ ప్రపంచంలోని టాప్ 10 బీచ్‌ల లిస్టును విడుదల చేసింది. అందులో గోవాలోని పాలోలెమ్ బీచ్‌కు 6వ స్థానం దక్కింది. ఆ విశేషాలే ఇవి...
ట్రంక్ బే, సెయింట్ జాన్, యు.ఎస్. వర్జిన్ ఐలాండ్స్
‘ఆ బీచ్‌కు వెళ్లాలంటే టికెట్ తీసుకోవాలి..’ అంటే వింతగా అనిపిస్తుంది. కానీ బీచ్ పరిరక్షణ కోసమే ఆ టికెట్ అంటారు ట్రంక్ బే నిర్వాహకులు. అమెరికాలోని వర్జిన్ ఐలాండ్స్‌లో సెయింట్ జాన్ ద్వీపం ఉంది. అక్కడి ట్రంక్ బే ప్రపంచంలోనే నెంబర్ వన్ అత్యుత్తమ బీచ్‌గా ఎంపికయ్యింది. మెత్తటి పిండిలా ఉండే తెల్లని ఇసుక, అత్యంత పారదర్శకమైన నీళ్లు, కళ్లను కట్టిపడేసే ప్రకృతి అందాలు, జల క్రీడలు.. ఇలా ఎన్నో ఈ బీచ్‌కు విశిష్టతను తెచ్చాయి. అక్కడి శుభ్రత బీచ్ ప్రేమికులకు తెగ నచ్చుతుంది.
ఎలాఫోనిసి బీచ్, గ్రీస్
గులాబీ బీచ్‌గా గ్రీస్‌లోని ఎలాఫోనిసి పేరు తెచ్చుకుంది. క్రీట్ నగరానికి ఆగ్నేయంగా ఈ బీచ్ ఉంది. తరతరాలుగా ఇసుకతో ప్రత్యేకమైన సముద్ర సూక్ష్మజీవుల పెంకులు కలవడం వల్ల అక్కడి ఇసుక గులాబీ రంగులోకి మారింది. బీచ్ దగ్గరి అందమైన టర్కోయిస్ నీటి మడుగుల్లో ఎంతసేపు గడిపినా మనసుకు తృప్తి అనేదే ఉండదు. అందుకే ఒకసారి వెళ్లన వాళ్లు మళ్లీ మళ్లీ అదే బీచ్‌కు వెళ్లాలని కోరుకుంటారు. నీళ్ల మధ్య ఏర్పడ్డ సన్నని ఇసుకగడ్డ దారిలో నడుస్తూ... పక్కనే ఉన్న జింకల ద్వీపం చేరుకోవడం గొప్ప అనుభూతిని మిగుల్చుతుంది.
గ్రేస్ బే బీచ్, టర్క్స్ అండ్ కేకస్
పేరుకు తగ్గ బీచ్ ఇది. తెల్లని మెత్తటి ఇసుకతో సుమారు 12 కిలోమీటర్ల పొడవున్న ఈ బీచ్‌లో చెత్త్తాచెదారం కాదు కదా... గులకరాళ్లు, సముద్ర పీచు కూడా కనిపించవు. అందుకే భువిపై వెలసిన స్వర్గంగా దీన్ని పిలుస్తారు. పెద్ద పెద్ద పగడపు దీవులు అడ్డుగా ఉంటూ... అట్లాంటిక్ సముద్రపు ఆటుపోట్లను బీచ్ దాకా రాకుండా అడ్డుకోవడం వల్లే ఇంత స్వచ్ఛత. ‘ప్రిన్సెస్ అలెగ్జాండ్రియా నేషనల్ పార్క్’లో భాగమైన గ్రేస్ బీచ్‌ను ప్రత్యేకంగా పరిరక్షిస్తున్నారు. ఈ దీవులు బ్రిటీష్ ఓవర్‌సీస్ టెరటరీలోకి వస్తాయి.
ఫ్లామెన్‌కో బీచ్, ప్యూర్టోరికో
గుర్రపు డెక్క ఆకారంలో కనిపించే ప్యూర్టోరికో లోని క్యూలెబ్రా ద్వీపంలో ఉన్న బీచ్ ఇది. స్వచ్ఛమైన ఈ నీలిరంగు నీళ్లలో స్విమ్మింగ్, స్నోర్కెలింగ్ చేయొచ్చు. సన్ బాతింగ్, క్యాంపింగ్‌లకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఒకవైపు ఎండ కాస్తుంటే... వేలాది మంది ఈ బీచ్‌లో సేదదీరుతూ కనిపిస్తారు. ప్యూర్టోరికో వెళ్లే టూరిస్టులు తప్పకుండా విహరించే బీచ్ ఇది.
గోల్డెన్ హార్న్ బీచ్, క్రొయేషియా
క్రొయేషియాలోని ప్రసిద్ధ సముద్ర తీరం గోల్డెన్ హార్న్. విభిన్నమైన తీరం ఆకారం, ప్రకృతి, స్వచ్ఛమైన నీళ్ల వల్ల ఇన్‌స్టా రీల్స్‌లో ప్యారడైజ్‌గా ప్రశంసలు పొందుతోంది. బంగారు వర్ణ ఇసుక తిన్నలే కాదు... ఈ తీరంలో ఎక్కువగా దొరికే మత్స్య సంపద వల్ల ప్రజల జీవితాలు బంగారుమయం అయ్యాయనే అర్థంలో ‘గోల్డెన్ హార్న్’ అని పిలుస్తారు. విండ్ సర్ఫింగ్, కైట్ సర్ఫింగ్, పెడల్ బోట్, బీచ్ వాలీబాల్ లాంటి జల క్రీడలు ఇక్కడ ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.
పాలోలెమ్ బీచ్, గోవా
ఏసియాలోని బీచుల్లో గోవాలోని పాలోలెమ్ బీచ్ ఒక్కటే గ్లోబల్ ఇండెక్స్ టాప్ బీచుల్లో స్థానం సాధించింది. దక్షిణ గోవాలోని నక్షత్రాకార బీచ్ పాలోలెమ్. కాయకింగ్, పెడల్ బోటింగ్ లాంటి సముద్ర క్రీడలకు ఈ బీచ్ ప్రసిద్ధి. పైగా సురక్షిత బీచ్‌గా గుర్తింపు పొందడం వల్ల... కుటుంబాలు, దీర్ఘకాలం బీచ్ పరిసరాల్లో గడపాలనుకునేవారు ఎక్కువగా పాలోలెమ్‌కు వెళ్తారు.
శాండీ పాయింట్ నేషనల్ వైల్డ్‌లైఫ్ రెఫ్యూజ్, సెయింట్ క్రాయ్, యు.ఎస్. వర్జిన్ ఐలాండ్స్
పోస్ట్‌కార్డ్‌పై కనిపించే అందమైన దృశ్యం శాండీ పాయింట్ బీచ్. కరేబియన్ సముద్ర నీళ్లలోని ఈ ద్వీపం వన్యప్రాణుల సంరక్షక ప్రాంతం. అరుదైన తాబేళ్లకు నెలవు. వందకు పైగా పక్షి జాతులను ఇక్కడ చూడవచ్చు. స్ఫటికమంత స్వచ్ఛమైన నీళ్లలో ఎంత సేపు గడిపినా తనివి తీరదు. అయితే ఈ బీచ్‌ను ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పూర్తిగా మూసేస్తారు. ఆ సమయంలో సముద్ర తాబేళ్లు బీచ్‌లో సంతానోత్పత్తి కోసం సేదతీరుతుంటాయి.
ప్లాయా బాలాండ్రా, మెక్సికో
మెక్సికోలో అత్యంత సుందరమైన సముద్ర తీరం ప్లాయా బాలాండ్రా. విచిత్రం ఏమిటంటే... ఈ బీచ్‌కు రోజూ 450 మందిని మాత్రమే అనుమతిస్తారు. అందుకే ఉదయం ఆరు గంటలకే ఎంట్రీ టికెట్ కోసం పెద్ద క్యూ ఉంటుంది. తెల్లని ఇసుక తిన్నెల్లో, పచ్చని నీళ్లమడుల్లో గడుపుతూ చాలామంది సేదతీరుతుంటారు. కాయకింగ్, స్నోర్కెలింగ్ లాంటి సముద్ర క్రీడలకు ఈ బీచ్ ప్రసిద్ధి.
ప్రయి దా ఫులెహ్, పోర్చుగల్
పోర్చుగల్ బీచ్‌ల లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్న బీచ్ ఇది. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఆల్‌గార్వే తీరంలో... కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ బీచ్ పక్కనే... పెట్టని కోటలా కొండల వరుస కనువిందు చేస్తుంది. సూర్యుడి కిరణాలకు తగినట్టు ఈ కొండల రంగు మారుతుంది. బంగారు ఇసుక తిన్నెలకు ఎర్రని కొండలు, ఆ పైన ఆకుపచ్చని చెట్లు... ప్రతీనిత్యం అందమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. శీతాకాలంలో ఈ బీచ్‌కు టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
ఈగల్ బీచ్, ఆరుబా
నెదర్లాండ్స్‌లో భాగమైన ఆరుబా ద్వీపదేశం కరేబియన్ ఐలాండ్స్‌లో విశిష్టమైంది. ‘వన్ హ్యాపీ ఐలాండ్’గా దీన్ని పిలుస్తారు. తుపాన్లు నిత్యం ఈ నేలల్లో దడపుట్టిస్తుంటాయి. కానీ ఆరుబా మాత్రం భౌగోళిక మినహాయింపు జోన్‌లో ఉంది. ఈగల్ బీచ్ వెచ్చని వాతావరణం మనసుకు హాయినిస్తుంది. ఈస్టర్ సమయంలో కుటుంబ సమేతంగా రోజుల తరబడి బీచ్‌క్యాంప్‌లో గడుపుతారు. ఈ బీచ్ తాబేళ్లకు ప్రసిద్ధి. ఇంకా బీచ్‌ను ఆనుకుని ఉండే ‘ఫోఫోటి’ చెట్లు ఇన్‌స్టా రీల్స్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఆరుబా ప్రత్యేకతను పెంచుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!
ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...
Read Latest AP News And Telangana News And International News And Telugu News