మైదానంలోనే క్లాస్ తీసుకున్నాడు.. అప్పుడు ధోనీని చూసి భయపడ్డా: కుల్దీప్ యాదవ్
ABN , Publish Date - Nov 29 , 2026 | 07:05 AM
ధోనీ చెప్పిన ప్లాన్‌ను బౌలర్ సరిగ్గా అమలు చేయకపోతే మాత్రం అతడి ఆగ్రహాన్ని చూడాల్సిందేనట. ఈ విషయాన్ని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్వయంగా వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థి బ్యాటర్లను తన వ్యూహాలతో బోల్తా కొట్టించడంలో ధోనీకి సాటి ఎవరూ లేరు. బౌలర్లకు విలువైన సూచనలు ఇస్తూ వికెట్లు పడేలా చేయడంలోనూ అతడికి మంచి పట్టుంది. అయితే ధోనీ చెప్పిన ప్లాన్‌ను బౌలర్ సరిగ్గా అమలు చేయకపోతే మాత్రం అతడి ఆగ్రహాన్ని చూడాల్సిందేనట. ఈ విషయాన్ని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్వయంగా వెల్లడించాడు.
2017లో ఇండోర్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటనను కుల్దీప్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. ‘శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా క్రీజులో ఉన్న సమయంలో నేను బౌలింగ్‌కు వచ్చా. ధోనీ నాకు ఒక వ్యూహాన్ని వివరించాడు. పాయింట్లో ఉన్న ఫీల్డర్‌ను ముందుకు తీసుకొచ్చి కవర్స్‌లో ఉన్న మరో ఫీల్డర్‌ను వెనక్కి పంపించాలని సూచించాడు. అలాగే ఆఫ్ స్టంప్‌కు వెలుపల బంతులు వేస్తే బ్యాటర్ టాప్ ఎడ్జ్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పాడు. అయితే నేను మాత్రం ధోనీ చెప్పిన వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయలేదు. దీంతో నా దగ్గరకు వచ్చి గట్టిగా ప్రశ్నించాడు. ‘నేను ఏమైనా తెలివితక్కువ వాడినని అనుకుంటున్నావా? 300కు పైగా వన్డేలు ఆడింది ఊరికే కాదు. చెప్పినట్లు చేయి’ అని అన్నాడు. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. ఆ తర్వాత ధోనీ చెప్పినట్లుగానే ఫీల్డింగ్ మార్పులు చేసి, ఆఫ్ స్టంప్‌కు వెలుపల బంతులు వేశా. పెరీరా టాప్ ఎడ్జ్ ఇచ్చాడు. బంతి బౌండరీ వద్ద ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడంతో వికెట్ దక్కింది. ధోనీ ముందుగానే ఊహించినట్లుగా వికెట్ పడటంతో నాకు ఆశ్చర్యమేసింది’ అని కుల్దీప్ యాదవ్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
సిరాజ్‌కు చోటివ్వకపోవడంపై కపిల్ దేవ్ అసహనం..
అండర్-19 మహిళల ఆసియా కప్ 2026కు భారత జట్టు ప్రకటన..