Share News

సిరాజ్‌కు చోటివ్వకపోవడంపై కపిల్ దేవ్ అసహనం..

ABN , Publish Date - Nov 28 , 2026 | 09:24 PM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీనిపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశారు.

సిరాజ్‌కు చోటివ్వకపోవడంపై కపిల్ దేవ్ అసహనం..
Kapil Dev

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీనిపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశారు. రెండు టెస్టుల్లోనూ భారత్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగినప్పటికీ సిరాజ్ బెంచ్‌కే పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది.


శనివారం 'ట్రైడెంట్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్' రెండో ఎడిషన్ ప్రకటన కార్యక్రమంలో కపిల్ దేవ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా మాట్లాడుతూ.. జట్టులో సిరాజ్ లేకపోవడం తనకూ బాధగా ఉందని, అతడు ఎంతో ప్రతిభ గల ఆటగాడని పేర్కొన్నాడు. జట్టులో స్థానం దక్కనప్పుడు మనం ఏమి చెప్పగలమంటూ నిట్టూర్చారు. మరోవైపు 'రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026' వన్డే టోర్నీలో యూఏఈపై యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన రికార్డుల సునామీపై కపిల్ ప్రశంసలు కురిపించారు. లిస్ట్-ఏ క్రికెట్‌లో వేగవంతమైన శతకం (28 బంతుల్లో), డబుల్ సెంచరీ (52 బంతుల్లో) సాధించడంతో పాటు ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 28 సిక్సర్లు బాది 53 బంతుల్లో 204 పరుగులు చేసిన వైభవ్ ప్రతిభను కొనియాడారు.


'మన దేశంలో ఇంతటి ప్రతిభ ఉండటం సంతోషంగా ఉంది. 15 ఏళ్ల కుర్రాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకంటే ఇంకేం కావాలి?' అని కపిల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) అధ్యక్షుడిగానూ ఉన్న కపిల్ దేవ్.. చండీగఢ్‌ను గొప్ప క్రీడా నగరంగా అభివర్ణించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన డీపీ వరల్డ్ టోర్నీ గురించి మాట్లాడుకుంటున్నారని, చండీగఢ్‌లోనూ ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నమెంట్ నిర్వహించాలని కోరుకుంటున్నామని చెప్పారు. క్రీడాకారులకు సరైన తోడ్పాటు అందిస్తే, వారి విజయంలో భాగస్వాములవడం ఎంతో ఆనందాన్నిస్తుందని కపిల్ దేవ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

మీ రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం.. కేరళం సీఎం సతీశన్ వ్యాఖ్యలపై దుమారం..

మహిళా రిజర్వేషన్లకు మేము మద్దతు ఇచ్చాం: కేటీఆర్

Updated Date - Nov 28 , 2026 | 09:24 PM