Share News

మీ రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం.. కేరళం సీఎం సతీశన్ వ్యాఖ్యలపై దుమారం..

ABN , Publish Date - Nov 28 , 2026 | 07:38 PM

కేరళంలో గత పదేళ్లలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొన్న దాడులు, హింసను ప్రస్తావిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీడీ సతీశన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

మీ రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం.. కేరళం సీఎం సతీశన్ వ్యాఖ్యలపై దుమారం..
Kerala CM VD Satheesan

ఇంటర్నెట్ డెస్క్: కేరళంలో గత పదేళ్లలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొన్న దాడులు, హింసను ప్రస్తావిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీడీ సతీశన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కాంగ్రెస్ కార్యకర్తల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సీపీఎం తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించింది (Kerala CM Controversy).


ఇటీవల కన్నూరులో యూత్ కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో సతీశన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ కార్యకర్తలు ఎదుర్కొన్న దాడులను ప్రభుత్వం మరిచిపోదని, వాటికి బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని ఆయన పేర్కొన్నారు. తమ కార్యకర్తల రక్తానికి ప్రతిఫలం అడుగుతామని, గతంలో జరిగిన ఘటనలను మరిచిపోయే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనల్లో బాధ్యులుగా ఉన్న వారందరిపై దర్యాప్తు కొనసాగించి, చివరి వరకు చట్టపరమైన పోరాటం చేస్తామని తెలిపారు (Kannur Political Violence).


ఈ వ్యాఖ్యలను రాజకీయ ప్రతీకారానికి పిలుపుగా భావిస్తూ సీపీఎం నేతలు విమర్శలు గుప్పించారు (Blood for Blood Remark). సతీశన్ వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవిలోకి వచ్చారని, భయం, పక్షపాతం లేకుండా పాలన సాగించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పేర్కొన్నారు. 'రక్తానికి రక్తం', 'ప్రతీకారం తీర్చుకుంటాం' అనే భావన వచ్చేలా ముఖ్యమంత్రి మాట్లాడటం తగదని విమర్శించారు. ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

మహిళా రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు.. ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు..


ఇది దక్షిణాది రాష్ట్రాల విజయం.. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ కీలక ప్రకటన..

Updated Date - Nov 28 , 2026 | 07:38 PM