బంగ్లాదేశ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 09:54 PM
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ రెండు టెస్టులు ఆడనుంది.
స్పోర్ట్స్ డెస్క్: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం (Mushfiqur Rahim) ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ రెండు టెస్టులు ఆడనుంది. మిర్పూర్లో జరిగే తొలి టెస్టే రహీం కెరీర్లో చివరి మ్యాచ్ కానుంది. అతడి రిటైర్మెంట్ విషయాన్ని బీసీబీ అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ వెల్లడించాడు.
‘ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ తర్వాత ముష్ఫికర్ రహీం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. కొన్ని రోజుల క్రితమే రహీం నాకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు. అప్పటి నుంచి నేను అతడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను. స్వయంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని అతడినే ప్రకటించమని చెప్పాను. ముష్పికర్ బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఎంతో గొప్ప సేవ చేసిన క్రీడాకారుడు. నన్నే అతడి రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించమన్నాడు. అందుకే ఈ ప్రకటన చేస్తున్నాను’ అని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు.
ఇక ముష్ఫికర్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే... 2005లో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ముష్పికర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తర్వాత మూడు ఫార్మాట్లలో జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. 2011-2017 మధ్య జట్టుకు నాయకత్వం వహించాడు. అత్యధిక కాలం టెస్టులకు నాయకత్వం వహించిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్ తరఫున 100కుపైగా టెస్టులు ఆడిన తొలి క్రికెటర్ రహీం రికార్డు సృష్టించాడు. అతడు 2025 నవంబర్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఇప్పటివరకు 108 టెస్టులు ఆడి 7,062 పరుగులు చేశాడు. అందులో 14 శతకాలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో టెస్టుల్లో 7 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్ గాను అరుదైన ఘనతను సాధించాడు. 2006 ఆగస్టులో వన్డేల్లో అరంగేట్రం చేసిన ముష్ఫికర్ 274 మ్యాచ్‌ల్లో 36.42 సగటుతో 7,795 పరుగులు చేశాడు. 2018లో మీర్పూర్లో జింబాబ్వేపై రహీం చేసిన 219 పరుగులు అతడి బెస్ట్ స్కోర్. 102 టీ20ల్లో 1500 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
సిరాజ్‌కు చోటివ్వకపోవడంపై కపిల్ దేవ్ అసహనం..
అండర్-19 మహిళల ఆసియా కప్ 2026కు భారత జట్టు ప్రకటన..