ప్రణీత్ అదిరెన్
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:31 AM
ప్రపంచ జూనియర్ అండర్-20 చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. వెనెజులాలోని కరాక్‌సలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో ఓపెన్ విభాగంలో ఏథన్ వాజ్, బాలికల కేటగిరిలో..
తెలుగు ఆటగాడికి కాంస్యం
సవిత, ఏథన్‌కు పసిడి పతకాలు
ప్రపంచ జూనియర్ అండర్-20 చెస్
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ అండర్-20 చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. వెనెజులాలోని కరాక్‌సలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో ఓపెన్ విభాగంలో ఏథన్ వాజ్, బాలికల కేటగిరిలో సవితశ్రీ భాస్కర్ స్వర్ణాలు నెగ్గి భారత్‌కు ‘డబుల్’ అందించారు. ఓపెన్‌లో తెలుగు ఆటగాడు ఉప్పల్ ప్రణీత్, బాలికల్లో నివేదిత కాంస్య పతకాలు గెలుపొందారు. ఓపెన్ విభాగంలో గోవాకు చెందిన 15 ఏళ్ల ఏథన్ వాజ్ మొత్తం పదకొండు రౌండ్లకు గాను 9 పాయింట్లు కొల్లగొట్టి చాంపియన్‌గా నిలవడంతో పాటు స్వర్ణం దక్కించుకున్నాడు. దీంతో పిన్న వయసులో ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ గెలిచిన ఆటగాడిగా ఏథన్ (15 ఏళ్ల 2 నెలలు) చరిత్ర సృష్టించాడు. దీంతో ఇప్పటిదాకా పిన్న వయసు ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా ఫ్రాన్స్ ఆటగాడు జోల్ లాతిర్ (15 ఏళ్ల 5 నెలలు) పేరిటనున్న రికార్డును ఏథన్ అధిగమించాడు. జోల్ లాతిర్ 1988లో ఈ ఘనత సాధించాడు. ఇక, ఓపెన్ కేటగిరిలోనే హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల ప్రణీత్ మొత్తం 11 రౌండ్లకు 8.5 పాయింట్లు దక్కించుకొని మూడోస్థానంతో కాంస్య పతకం అందుకున్నాడు. ప్రణీత్‌కు ఈ ఏడాదిలో ఇది నాలుగో అంతర్జాతీయ పతకం కావడం విశేషం. బాలికల విభాగంలో తమిళనాడుకు చెందిన సవితశ్రీ 11 రౌండ్లకు 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని అందుకొని స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. తమిళనాడుకే చెందిన నివేదిత (7.5) తృతీయ స్థానంతో కాంస్యం చేజిక్కించుకుంది. కాగా, ఈ మెగా టోర్నీలో ఒకేసారి డబుల్ గోల్డ్ దక్కడం భారత్‌కు ఇది రెండోసారి. అంతకుముందు 2008 టోర్నీలో బాలురలో అభిజీత్ గుప్తా, బాలికల్లో ద్రోణవల్లి హారిక విజేతలుగా నిలిచారు.