పంత్ అందుకే టీమిండియాకు కెప్టెన్ అవ్వలేకపోయాడు: అశ్విన్
ABN , Publish Date - Nov 29 , 2026 | 08:38 AM
పంత్‌పై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ పంత్ తన ఆటలో నిర్ణయాలు తీసుకునే విధానాన్ని మెరుగుపరుచుకోలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ దూకుడుగా ఆడే క్రమంలో మరోసారి వికెట్ కోల్పోయాడు. దీంతో 23 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో పంత్‌పై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ పంత్ తన ఆటలో నిర్ణయాలు తీసుకునే విధానాన్ని మెరుగుపరుచుకోలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో భారత జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఇందుకే రాలేదని వ్యాఖ్యానించాడు.
‘రిషభ్ పంత్‌కు అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచే ప్రతిభ ఉంది. కానీ తన ఆటను మరింత మెరుగుపరుచుకుని, సరైన నిర్ణయాలు తీసుకుంటే భారత టెస్టు జట్టులో నాలుగో స్థానంలో శాశ్వతంగా స్థానం సంపాదించేవాడు. వికెట్ కీపింగ్ చేయాల్సిన అవసరం కూడా లేకపోయేది. ఆటలో అతడు తీసుకునే నిర్ణయాల కారణంగానే భారత టెస్టు జట్టుకు కెప్టెన్ కూడా అవ్వలేకపోయాడని నా అభిప్రాయం. అదే అతడిని వెనక్కి లాగుతోంది. ఇంతటి నైపుణ్యం ఉన్న ఆటగాడు టీ20, వన్డే జట్లలో కూడా ఎందుకు నిలకడగా ఆడలేకపోయాడు? అతడి షాట్ ఎంపిక, ఆటతీరుపై తీసుకునే నిర్ణయాల విషయంలోనే సమస్య ఉంది.
భారత్ తరఫున ఆడిన అత్యంత ప్రతిభావంతమైన టెస్టు బ్యాటర్లలో రిషబ్ పంత్ ఒకడు అని నేను ఎప్పుడూ చెబుతుంటాను. కానీ చాలా సందర్భాల్లో అతడు భారీ రిస్క్ ఉన్న షాట్లు ఆడుతూ వికెట్ కోల్పోతున్నాడు. క్రీజు వదిలి ముందుకొచ్చి ఫీల్డర్ల మీదుగా బంతిని కొట్టాలని చూస్తాడు. కానీ ఫీల్డర్లు ఎక్కడ ఉంటారో అక్కడికే బంతిని కొట్టి క్యాచ్ ఇస్తున్నాడు. సరైన నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ల సరసన నిలిచే సత్తా అతడికి ఉంది. అతడి ప్రతిభను చూస్తే ఇలా వికెట్లు కోల్పోవడం బాధగా అనిపిస్తుంది’ అని అశ్విన్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌తో టెస్టు: జురెల్ సెంచరీ మిస్.. 246 పరుగులకే భారత్ ఆలౌట్
మైదానంలోనే క్లాస్ తీసుకున్నాడు.. అప్పుడు ధోనీని చూసి భయపడ్డా: కుల్దీప్ యాదవ్