Share News

బ్యాట్లెత్తేశారు!

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:38 AM

వారంలోపే ఎంత తేడా.. బరిలోకి దిగిన ప్రతీ బ్యాటర్‌ అదరగొట్టడంతో తొలి టెస్టులో ఏకంగా 700+ పరుగులు సాధించిన భారత జట్టు.. ఇప్పుడు కనీసం 150 రన్స్‌ చేసేందుకు సగం మందిని కోల్పోయి ఆపసోపాలు పడుతోంది.

బ్యాట్లెత్తేశారు!

  • భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ 116/6

  • అదరగొట్టిన జేమిసన్‌, డఫీ

  • న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 356

వెల్లింగ్టన్‌: వారంలోపే ఎంత తేడా.. బరిలోకి దిగిన ప్రతీ బ్యాటర్‌ అదరగొట్టడంతో తొలి టెస్టులో ఏకంగా 700+ పరుగులు సాధించిన భారత జట్టు.. ఇప్పుడు కనీసం 150 రన్స్‌ చేసేందుకు సగం మందిని కోల్పోయి ఆపసోపాలు పడుతోంది. న్యూజిలాండ్‌ పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా బ్యాటర్లను వణికిస్తున్నారు. దీంతో రెండో టెస్టులో గిల్‌సేన పీకల్లోతు కష్టాల్లో పడగా, ఆతిథ్య కివీస్‌ పూర్తి ఆధిపత్యంలో కొనసాగుతోంది. ఆటకు రెండో రోజైన శనివారం ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 116/6 పరుగులతో నిలిచింది. క్రీజులో జురెల్‌ (7) ఉన్నాడు. రాహుల్‌ (25), రిషభ్‌ పంత్‌ (23), దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (21) మోస్తరుగా ఆడారు. డఫీ, జేమిసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. భారత్‌ ఇంకా 240 రన్స్‌ వెనుకంజలో ఉండగా, పిచ్‌పై బ్యాటింగ్‌ అంత సులువుగా కనిపించడం లేదు. దీంతో జురెల్‌కు టెయిలెండర్ల నుంచి ఏమేరకు సహకారం అందుతుందో చూడాలి. అంతకుముందు పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ (5/99) చెలరేగడంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 356 రన్స్‌కు ఆలౌటైంది. బ్లండెల్‌ (89), ఫిలిప్స్‌ (36), నాథన్‌ స్మిత్‌ (26) రాణించారు. బ్రార్‌, అన్షుల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.


‘తోక’ సహకారంతో..: ఓవర్‌నైట్‌ స్కోరు 246/5తో రెండో రోజును ఆరంభించిన కివీస్‌ 350+ రన్స్‌ చేయడంలో లోయరార్డర్‌ కీలక పాత్ర పోషించింది. రెండో ఓవర్‌లోనే ఫిలిప్స్‌ వెనుదిరగడంతో ఆరో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బ్లండెల్‌కు స్మిత్‌, జేమిసన్‌ (19) సహకరించారు. బౌలర్లను వీరు దీటుగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరినీ ఆకాశ్‌ అవుట్‌ చేయగా, ఏడో వికెట్‌కు స్మిత్‌తో కలిసి 44, ఎనిమిదో వికెట్‌కు జేమిసన్‌తో కలిసి బ్లండెల్‌ 33 రన్స్‌ జోడించాడు. హెన్రీ (19) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను దేవ్‌దత్‌ వదిలేశాడు. ఇక 330/8 స్కోరుతో కివీస్‌ లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్‌ ఆరంభంలోనూ హెన్రీ క్యాచ్‌ను బ్రార్‌ వదిలేశాడు. కాసేపటికే వరుస ఓవర్లలో బ్లండెల్‌ను బ్రార్‌, హెన్రీని ఆకాశ్‌ అవుట్‌ చేయడంతో కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

తొలి ఓవర్‌లోనే ఝలక్‌: మొదటి ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత్‌ను కివీస్‌ పేసర్లు కుదురుకోనీయలేదు. పిచ్‌ సీమర్లకు సహకరించడంతో బ్యాటింగ్‌ చేయడం కష్టంగా మారింది. తొలి ఓవర్‌ ఆఖరి బంతికే ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (0)ను హెన్రీ బౌల్డ్‌ చేశాడు. దేవ్‌దత్‌ను జేమిసన్‌ వెనక్కి పంపాడు. కెప్టెన్‌ గిల్‌ (17) కుదురుకున్నట్టు కనిపించినా జేమిసన్‌ ఓవర్‌లో స్లిప్‌లో దొరికిపోయాడు. ఆ వెంటనే 59/3 స్కోరుతో జట్టు టీ బ్రేక్‌కు వెళ్లింది.


పంత్‌ నిర్లక్ష్యం: ఓపిగ్గా క్రీజులో నిలిచిన రాహుల్‌తో పాటు చివరి సెషన్‌లో బరిలోకి దిగిన పంత్‌పై జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. వీరి ఆటే కీలకం కానుందని ఫ్యాన్స్‌ భావించారు. ఆరంభంలో పంత్‌ సహజశైలికి భిన్నంగా పాతుకుపోయాడు. తొలి 25 బంతుల్లో 9 పరుగులే చేయగా... అటు రాహుల్‌ డిఫెన్స్‌కే పరిమితమై సింగిల్‌ తీసేందుకే 26 బంతులు తీసుకున్నాడు. ఈ స్థితిలో డఫీ వేసిన తొలి ఓవర్‌లో పంత్‌ లాంగాన్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. ఆ తర్వాత స్మిత్‌ ఓవర్‌లోనూ ఫ్రంట్‌ ఫుట్‌ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. జట్టు కష్టాల్లో ఉన్న దశలో పరిస్థితిని అర్థం చేసుకోకుండా పంత్‌.. డఫీ రెండో ఓవర్‌లోనూ దూకుడుగా ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. 27వ ఓవర్‌ చివరి బంతిని అమాంతం గాల్లోకి లేపగా, పాయింట్‌ నుంచి పరిగెత్తుకుని వచ్చిన జేమిసన్‌ పట్టేశాడు. దీంతో పంత్‌కు నిరాశ తప్పలేదు. మరోవైపు ఓపిగ్గా క్రీజులో నిలిచిన రాహుల్‌ సైతం ఒక్కసారిగా నిరుత్సాహపరిచాడు. డఫీ వేసిన వైడ్‌ ఆఫ్‌ ఫుల్లర్‌ డెలివరీని స్క్వేర్‌ డ్రైవ్‌ ఆడి కాన్వేకు చిక్కాడు. అటు రాహుల్‌ సైతం తానాడిన షాట్‌ను చూసి షాక్‌కు గురైనట్టు కనిపించింది. ఈ దశలో కివీస్‌ బౌలర్లు పూర్తి పట్టు సాధించగా.. వాషింగ్టన్‌ సుందర్‌ (10), జురెల్‌ జోడీ ఒక్కో పరుగు రాబట్టేందుకు చెమటలు కక్కింది. ఎంతలా అంటే.. ఆరో వికెట్‌కు 91 బంతులు ఎదుర్కొన్న ఈ ఇద్దరూ కలిసి చేసింది 12 పరుగులే కావడం గమనార్హం. అయితే, రెండోరోజు ఆట చివరి బంతికి సుందర్‌ అవుటయ్యాడు.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) పంత్‌ (బి) ఆకాశ్‌ 59, కాన్వే (ఎల్బీ) బ్రార్‌ 31, నికోల్స్‌ (సి) ఆకాశ్‌ (బి) అన్షుల్‌ 16, రచిన్‌ (సి) పంత్‌ (బి) ఆకాశ్‌ 0, మిచెల్‌ (సి) జురెల్‌ (బి) సుందర్‌ 31, బ్లండెల్‌ (సి) ఆకాశ్‌ (బి) బ్రార్‌ 89, ఫిలిప్స్‌ (సి) పంత్‌ (బి) అన్షుల్‌ 36, స్మిత్‌ (సి అండ్‌ బి) ఆకాశ్‌ 26, జేమిసన్‌ (సి) జైస్వాల్‌ (బి) ఆకాశ్‌ 19, హెన్రీ (సి) పంత్‌ (బి) ఆకాశ్‌ 19, డఫీ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 28; మొత్తం: 116.3 ఓవర్లలో 356 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-77, 2-110, 3-110, 4-110, 5-184, 6-247, 7-291, 8-324, 9-346, 10-356. బౌలింగ్‌: బుమ్రా 26-6-49-0, అన్షుల్‌ 22-5-79-2, ఆకాశ్‌ 31.3-8-99-5, బ్రార్‌ 28-4-78-2, సుందర్‌ 9-1-36-1.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) హెన్రీ 0, రాహుల్‌ (సి) కాన్వే (బి) డఫీ 25, దేవ్‌దత్‌ (సి) బ్లండెల్‌ (బి) జేమిసన్‌ 21, గిల్‌ (సి) లాథమ్‌ (బి) జేమిసన్‌ 17, పంత్‌ (సి) జేమిసన్‌ (బి) డఫీ 23, సుందర్‌ (సి) లాథమ్‌ (బి) స్మిత్‌ 10, జురెల్‌ (బ్యాటింగ్‌) 7; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 46 ఓవర్లలో 116/6. వికెట్ల పతనం: 1-0, 2-33, 3-59, 4-96, 5-104, 6-116. బౌలింగ్‌: హెన్రీ 13-4-29-1, జేమిసన్‌ 13-4-33-2, స్మిత్‌ 12-3-29-1, డఫీ 8-3-21-2.

Updated Date - Nov 29 , 2026 | 03:43 AM