Share News

ఓటరన్న కరుణించేదెవరినో..?

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:17 AM

మున్సిపల్‌ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటరన్న ఎవరిని కరుణిస్తాడోనని ఆయా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

ఓటరన్న కరుణించేదెవరినో..?
Telangana Municipal Elections

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): మున్సిపల్‌ పోలింగ్‌కు (Telangana Municipal Elections) సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటరన్న ఎవరిని కరుణిస్తాడోనని ఆయా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వారం రోజుల పాటు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. గెలుపుపై ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు, నాయకులు ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. వార్‌ వన్‌ సైడేనని కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంటుండగా, మళ్లీ మేమే మెజారిటీ స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేజిక్కించుకుంటామని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే పోటీ అని మేజిక్‌ ఫిగర్‌ దాటి మున్సిపాలిటీలపై కాషాయం జెండాను ఎగుర వేస్తామని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి, కొందరు స్వతంత్రంగా బరిలో దిగారు. వీరి మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది.


జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో ఒకటి ఏకగ్రీవం కాగా, 59లో 315 మంది అభ్యర్థులు, పెద్దపల్లిలోని 36 వార్డుల్లో 157 మంది, సుల్తానాబాద్‌లో 15 వార్డుల్లో 61 మంది, మంథనిలోని 13 వార్డుల్లో 48 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌లు ముమ్మర ప్రచారం నిర్వహించారు. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల గురించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, 500 రూపాయలకే వంట గ్యాస్‌, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా, సన్నరకం ధాన్యానికి 500 రూపాయల బోనస్‌, మహిళలకు ఉపాధి అవకాశాలు, తదితర పథకాల అమలు గురించి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో కార్పొరేషన్‌‌తో సహా మూడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, పుట్ట మధూకర్‌, దాసరి మనోహర్‌‌రెడ్డిలు ప్రచారం చేశారు. రామగుండం, మంథనిలో బీఆర్‌ఎస్‌ ప్రచారం బాగా జరిగినప్పటికీ, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తరపున ముమ్మరంగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. కేవలం అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారేగానీ, వ్యూహ, ప్రతివ్యూహాలు ఏమీ జరగలేదు. అభ్యర్థులే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మిగతా మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్ల పాలన తీరు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చలేదని విమర్శించారు.


బీజేపీ అభ్యర్థులు రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో కొంత ప్రభావం చూపుతున్నప్పటికీ, మంథనిలో అంతంత మాత్రంగానే ఉంది. బీజేపీ తరపున కేంద్రమంత్రి జి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, పార్టీ నాయకులు దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, ఎస్‌. కుమార్‌, కందుల సంధ్యారాణి, నల్ల మనోహర్‌రెడ్డి, గొట్టిముక్కుల సురేష్‌రెడ్డి, రాణి రుద్రమ, మీస అర్జున్‌ రావు, తదితరులు అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. కానీ చైర్మన్‌ స్థానాలను దక్కించునేందుకు కావాల్సిన మెజారిటీ స్థానాల్లో గెలిచే అవకాశాలు కనబడడం లేదు. మున్సిపాలిటీల్లో 2 నుంచి 5 స్థానాల్లో, రామగుండం మున్సిపాలిటీలో 6 నుంచి 9 స్థానాల్లో గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ నాలుగింటిలో గులాబీ జెండా ఎగరవేయగా, ఆ పార్టీకి ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన అభ్యర్థులే ఎక్కువ మంది గెలవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఎన్నికల్లో జిల్లాలోని కార్పొరేషన్‌‌తో సహా మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులే మెజారిటీ స్థానాల్లో గెలుపొంది మేయర్‌, చైర్మన్‌ పదవులను దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పాడి గేదెల పేరుతో భారీ మోసం.. పశువులను ఇంటికే పంపిస్తామంటూ..

రేవంత్‌రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్‌రావు సెటైర్లు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 10:08 AM