Share News

టీచర్లా.. సేల్స్‌మెన్లా ?

ABN , Publish Date - May 09 , 2026 | 11:48 AM

ఉపాధ్యాయ కోర్సు చదివి, ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిన నిరుద్యోగులను ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి.

టీచర్లా.. సేల్స్‌మెన్లా ?
private school teachers

  • ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో అడ్మిషన్ల టార్గెట్‌

  • మండుటెండలో ఇంటింటికి తిరుగుతున్న టీచర్లు

  • వేసవి సెలవుల్లేవ్‌, ఆదివారాలు అసలే లేవు

  • వేధింపులు తాళలేక సొంత డబ్బుతో అడ్మిషన్లు

  • ప్రైవేట్‌, కార్పొరేట్‌ టీచర్ల వెట్టిచాకిరీ

అనంతపురం: ఉపాధ్యాయ కోర్సు చదివి, ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిన నిరుద్యోగులను ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి. అడ్మిషన్ల పేరుతో వేధిస్తున్నాయి. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి. అరకొర వేతనాలు ఇస్తూ, మండే ఎండల్లో అడ్మిషన్ల కోసం ఇంటింటికి తిప్పుతున్నాయి. ఇచ్చిన టార్గెట్‌ పూర్తి చేయకపోతే ఉద్యోగానికి భరోసా ఉండదు. దీంతో పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రైవేట్‌ టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులనే కాక తమకు తెలిసిన వారిని, పరిచయమున్న వారిని, బంధువులను అడ్మిషన్ల కోసం బతిమాలాల్సిన పరిస్థితి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వేధింపులు, బాధలు భరిస్తూ ఆయా పాఠశాలల టీచర్లు అడ్మిషన్ల వేటలో పడ్డారు.


పోటాపోటీ..

పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు అడ్మిషన్ల కోసం విపరీతంగా పోటీపడుతున్నాయి. గతంలో కేవలం ప్రచారాలు, అడ్వర్టైజ్‌మెంట్‌లతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించడానికి ప్రయత్నించేవారు. ప్రస్తుతం ప్రైవేట్‌ విద్యా సంస్థల మధ్య పెరిగిన పోటీతో అడ్మిషన్ల కోసం టీచర్లతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. సంస్థలో పని చేసే టీచర్లు, ఇతర సిబ్బంది ఎవరైనా సరే ఇన్ని అడ్మిషన్లు చేయాల్సిందే అంటూ టార్గెట్‌ పెడుతున్నారు. ఈనేపథ్యంలో యాజమాన్యం పేరుతో ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు కిందిస్థాయి సిబ్బంది, టీచర్లపై రుబాబు చూపుతున్నారు. ఇదే సాకుగా తమకు నచ్చనివారిని ఇంటికి పంపేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో ఇదేమి ఖర్మరా దేవుడా అంటూ ఆయా ఉద్యోగులు అడ్మిషన్ల కోసం సతమతం అవుతున్నారు.


మండుటెండలో అడ్మిషన్ల వేట

ఇతర ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతోనే బీఈడీ, టీటీసీ చేసిన నిరుద్యోగులు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో చేరి జీవనోపాధి పొందుతున్నారు. వీరిపై పాఠాలు బాగా చెప్పండి అనే ఒత్తిడి కాకుండా అడ్మిషన్ల ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. పాఠాలు సక్రమంగా చెప్పకపోయినా పర్వాలేదు ఎవరు ఎక్కువ అడ్మిషన్లు చేస్తే వారికే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు. అడ్మిషన్లు చేయకపోతే సతాయిస్తూ మీ సేవలు అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఈక్రమంలో అందరూ వేసవి సెలవులను పిల్లాపాపలు,


zzz.jpgబంధువులతో ఆహ్లాదంగా గడుపుతుంటే వీరు మాత్రం ఉదయం 8 గంటలకే పాఠశాలకు చేరుకుని ముఖహాజరు వేసి, అడ్మిషన్ల కోసం వీధుల వెంట తిరగాల్సి వస్తోంది. తెల్లారే సరికి రోడ్లపైకి వచ్చి, కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ‘సార్‌, మేడం మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? వారిని మా స్కూల్లో చేర్పించండి. కావాలంటే ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఫీజు కాస్త తగ్గేలా చూస్తాం’ అంటూ ప్రాధేయపడుతున్నారు. కనీసం ఆదివారాలు కూడా సెలవు లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూళ్లు, అడ్మిషన్లు అని తిరుగుతుండటంతో ఇంట్లో భార్య భర్తల మధ్య కూడా విభేదాలు రేగుతున్నట్లు సమాచారం.


సొంత డబ్బుతో అడ్మిషన్లు

అడ్మిషన్ల టార్గెట్‌ను రోజువారీగా యాజమాన్యాలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో చెప్పిన మేరకు అడ్మిషన్‌కు అడ్వాన్స్‌ కింద ఒక్కోవిద్యార్థికి రూ. 5వేలు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ చేరుతామని చెప్పిన పిల్లలు చేరకపోతే ఇచ్చిన సంఖ్య మేరకు ప్రైవేట్‌ టీచర్లే అడ్మిషన్‌ ఫీజు చెల్లించి, పేర్లు రాయించాల్సి వస్తోందని పలువురు సిబ్బంది వాపోతున్నారు. కొందరు ప్రైవేట్‌ టీచర్లు అప్పులు చేసి ఈ అడ్మిషన్‌లకు అడ్వాన్స్‌ ఫీజులు కడుతున్నట్లు తెలిసింది. అడ్మిషన్ల కోసం ఇంతగా వేధించే యాజమాన్యాలు తీరా పాఠశాలలు రీ ఓపెన్‌ చేసే జూన్‌ నెలలో మాత్రం సీట్లు లేవని బోర్డులు పెడుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కల్పించుకుని అడ్మిషన్ల వేధింపుల నుంచి కాపాడాలని పలువురు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది కోరుతున్నారు.


  • రుద్రంపేట సమీపంలోని ఓ పాఠశాలలో పని చేస్తున్న ఓ టీచర్‌ అడ్మిషన్ల కోసం తమ బంధువులు, స్నేహితులను అడుగుతూ ఇబ్బంది పెడుతోందని, ఇంటిని పట్టించుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు అడ్మిషన్లు అంటూ తిరుగుతోందని విసిగిపోయిన ఆమె భర్త ఆగ్రహంతో పాఠశాలకు వెళ్లి, అందరి సమక్షంలో తిడుతూ, భార్యపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ సాయంత్రం జరిగిన సంఘటనను మరుసటి రోజుకే ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ మరిచిపోయారు. ఏమీ జరగనట్లు టీచర్లపై చిందులేసి, అడ్మిషన్ల కోసం తరిమారు. ఈ ఒక్క ఉదంతం చాలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల టీచర్ల దుస్థితిని వివరించడానికి.


ఈ వార్తలు కూడా చదవండి:

టెక్నాలజీతో ఇంటికి భద్రత

గవర్నర్‌ నిర్ణయం సరైనదే!

Read Latest Telangana News and National News

Updated Date - May 09 , 2026 | 11:48 AM