Share News

గవర్నర్‌ నిర్ణయం సరైనదే!

ABN , Publish Date - May 09 , 2026 | 06:55 AM

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉన్నట్లు నిరూపించుకున్న తర్వాతే టీవీకే అధినేత విజయ్‌ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్‌ అనుమతిస్తారని...

గవర్నర్‌ నిర్ణయం సరైనదే!

మెజారిటీపై ఆయన సంతృప్తి చెందాలి

  • ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకునే వారు తమ సంఖ్యాబలాన్నీ వివరించాలి

  • వ్యక్తులు, భావోద్వేగాలు కాదు... రాజ్యాంగం, చట్టాలే ముఖ్యం

  • రాజ్యాంగ నిపుణుడు వికాస్‌ బన్సోడే

న్యూఢిల్లీ, మే 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉన్నట్లు నిరూపించుకున్న తర్వాతే టీవీకే అధినేత విజయ్‌ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్‌ అనుమతిస్తారని రాజ్యాంగ నిపుణుడు వికాస్‌ బన్సోడే చెప్పారు. ఇదే సరైన విధానమని తెలిపారు. ‘‘విజయ్‌కి అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల మద్దతు లేనందువల్లే ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించలేదు. ఈ విషయంలో ఆయన రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించారు’’ అని వికాస్‌ బన్సోడే శుక్రవారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. విజయ్‌కి తన పార్టీ ఎమ్మెల్యేలతోపాటు... అధికారిక లేఖల ద్వారా కనీసం మరో 11 మంది మద్దతు ఉన్నట్లు చూపిస్తేనే గవర్నర్‌ ఆయనను ఆహ్వానిస్తారని అన్నారు. అదే సమయంలో... సభలో మెజారిటీ నిరూపించుకునేందుకు 48 గంటలకంటే ఎక్కువ సమయం ఇవ్వరాదని ఆయన చెప్పారు.

రాజ్యాంగం, చట్టాలు, తీర్పులే ముఖ్యం...

వ్యక్తుల భావోద్వేగాలు, రాజకీయ జనాదరణ, టీవీ స్టూడియో చర్చల్లో తలెత్తే అభిప్రాయాలకంటే రాజ్యాంగం, చట్టాలు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే గవర్నర్‌కు ముఖ్యమని వికాస్‌ చెప్పారు. ‘‘మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు ఎలా ఆహ్వానించగలరు? మద్దతు లేఖలు, పొత్తులకోసం ఒప్పందాలు, ఎన్నికైన సభ్యులు చెప్పే మాటలను తనిఖీ చేసుకోవడం వంటి అధికారిక సమాచారం ఆధారంగానే రాజ్యాంగాధినేతలు నిర్ణయం తీసుకుంటారు. బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఇలాంటి విషయాల్లో రాజ్యాంగాధి నేతలకు శిరోధార్యం’’ అని చెప్పారు. ప్రభుత్వానికి మెజారిటీ మద్దతు ఉందా లేదా అన్న విషయం శాసనసభలోనే తేలాలని, గవ ర్నర్‌ నిర్ణయించలేరని బొమ్మై కేసులో చెప్పారని... అదే సమయంలో గవర్నర్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదని, రాజ్యాంగ ప్రక్రియలను తు.చ.తప్పకుండా పాటించాలని సదరు తీర్పులో పేర్కొన్నారని వికాస్‌ వెల్లడించారు. ‘‘మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువున్నంత మాత్రాన ఒకరికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశాన్ని అడ్డుకోరాదు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న వ్యక్తి అసెంబ్లీలో తనకు మెజారిటీ సభ్యుల మద్దతు ఏ విధంగా లభిస్తుందో చెప్పగలగాలి. తగిన మద్దతు సాధించగలరన్న నమ్మకం గవర్నర్‌కు కలిగితే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఆ వెంటనే శాసన సభలో మద్దతు నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలి’’ అని వివరించారు.


గతంలో ఇలా...

ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి తలెత్తినప్పుడు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను వికాస్‌ బన్సోడే గుర్తు చేశారు. అవి...

  • ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా రాజకీయ పార్టీలను అనుమతించకపోవడం సరైంది కాదని బిహార్‌ శాసన సభ రద్దు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

  • 2017లో మణిపూర్‌ లో కాంగ్రెస్‌ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ గవర్నర్‌ బీజేపీ నాయకత్వంలో ఎన్నికల అనంతరం ఏర్పడిన సంకీర్ణ కూటమిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. అందువల్ల ఏకైక అతి పెద్ద పార్టీ కావడంకంటే సభలో మెజారిటీ నిరూపించుకోవడమే ముఖ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

  • 2018లో కర్ణాటకలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినందువల్ల యడ్యూరప్పను గవర్నర్‌ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి బలపరీక్షకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ... సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని 24 గంటల్లోనే మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించింది. బల నిరూపణలో విఫలమైన యడ్యూరప్ప ప్రభుత్వం పడిపోయింది. మహారాష్ట్రలో 2019లో తెల్లవారుజామున రాష్ట్రపతి పాలనను ఎత్తి వేసి వివాదాస్పద మద్దతు లేఖల ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ... సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని వెంటనే బలనిరూపణ చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మెజారిటీ శాసన సభలోనే తేలాలి. లోక్‌ భవన్‌ ఏకపక్షంగా నిర్ణయించలేదు.

ఇవి కూడా చదవండి...

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం

Updated Date - May 09 , 2026 | 06:55 AM