పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం
ABN , Publish Date - May 08 , 2026 | 09:09 PM
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puducherry)లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్డీయే నేతగా ఎన్నికైన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ ఎన్.రంగస్వామి.. లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాసనాథన్‌ను శుక్రవారం కలిశారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు.
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puducherry)లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్డీయే నేతగా ఎన్నికైన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) చీఫ్ ఎన్.రంగస్వామి (Rangasamy).. లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాసనాథన్‌ను శుక్రవారం కలిశారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఆయన అందజేసిన లేఖను రాష్ట్రపతి ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ పంపనున్నారు. రంగస్వామితో పాటు భాగస్వామ్య పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు.
13న ప్రమాణస్వీకారం
రంగస్వామి అందజేసిన లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపుతునట్టు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. మే 13న రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు చెప్పాయి. ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణస్వీకారం చేయనుండటం ఇది ఐదోసారి.
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ 16 సీట్లలో పోటీచేసి 12 చోట్ల గెలిచింది. భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ 10 సీట్లలో పోటీ చేసి 4 చోట్ల గెలిచింది. అన్నాడీఎంకే, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన ఎల్‌జేకే చెరో సీటు గెలుచుకున్నాయి. దీంతో మొత్తం 30 స్థానాల్లో ఎన్డీయే బలం 18కి చేరింది. అసెంబ్లీలో ముగ్గురు నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు. కాగా, విపక్ష డీఎంకే 5, కాంగ్రెస్ ఒక చోట గెలిచింది. విజయ్ టీవీకే 2 స్థానాల్లో గెలుపొందింది. పాండిచ్చేరి సీఎం పదవికి ఎన్.రంగస్వామి గురువారంనాడు రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలోనే గవర్నర్‌ను కలిసి లేఖ ఇవ్వనున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
విజయ్‌కు గవర్నర్ అనుమతి.. ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం