Share News

ఒకేసారి రెండు వేరు వేరు జాతుల పాములు కరిస్తే ఏమవుతుందో తెలుసా?

ABN , Publish Date - May 09 , 2026 | 10:30 AM

నాగుపాము, కట్లపాములో న్యూరోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఇది మనిషి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తపింజరిలో హెమోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఈ విషం కారణంగా అంతర్గత రక్తస్రావం జరుగుతుంది.

ఒకేసారి రెండు వేరు వేరు జాతుల పాములు కరిస్తే ఏమవుతుందో తెలుసా?
Venomous Snake Bite

ఇంటర్‌నెట్ డెస్క్: తెలంగాణలోని జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం ముండిచింతతండాలో నాలుగేళ్ల బాలుడు ఒకేసారి రెండు విష సర్పాలు కాటేయటంతో ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం అర్థరాత్రి శ్రీయన్ అనే బాలుడు నిద్రలో ఉండగా.. మొదట నాగుపాము కాటు వేసింది. కొద్దిసేపటి తర్వాత రక్త పింజరి కాటు వేసింది. ఒకేసారి రెండు పాములు కాటు వేయటంతో ఆస్పత్రికి తరలించేలోగానే చిన్నారి మృతి చెందాడు.


ఒకేసారి రెండు విషపూరిత పాములు కరిస్తే జరిగేది ఇదే..

ఒకేసారి రెండు వేరువేరు జాతుల విషపూరిత పాములు కరిస్తే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. దీని ప్రభావం శరీరంలోని వేరు వేరు వ్యవస్థలపై ఒకేసారి పడుతుంది. నాగుపాము, కట్లపాములో న్యూరోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఇది మనిషి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తపింజరిలో హెమోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఈ విషం కారణంగా అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. దానికి తోడు రక్తం కూడా గడ్డకట్టదు. నాగుపాము, కట్లపాము, రక్త పింజరిలో సైటోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఇది కణజాలాన్ని నాశనం చేస్తుంది.


ఒకేసారి(కొన్ని నిమిషాల తేడాతో అయినా సరే) రెండు వేరు వేరు జాతుల పాములు కరిస్తే.. ఒక జాతి పాములోని విషం శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంటే, మరొక జాతి పాములోని విషం రక్తాన్ని పాడు చేస్తుంది. దీనివల్ల కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు చాలా వేగంగా విఫలమవుతాయి. విషం మోతాదు రెట్టింపు అవ్వడమే కాకుండా.. శరీరంలో రెండు వేరు వేరు రసాయన చర్యలు జరగడం వల్ల ప్రాణం అత్యంత తొందరగా పోయే అవకాశం ఉంటుంది.


డాక్టర్లు ఏం చేస్తారు?..

సాధారణంగా విషపూరిత పాములు కరిచినపుడు డాక్టర్లు యాంటీ వీనమ్ ఇంజెక్షన్ వేస్తారు. అది కూడా ఏ జాతి పాము కరిచిందో తెలుసుకుని మరీ యాంటీ వీనమ్ ఇస్తారు. ఒకేసారి రెండు వేరు వేరు జాతులకు చెందిన పాములు కరిచినపుడు ఏ రకమైన యాంటీ వీనమ్ ఇవ్వాలో నిర్ణయించటం డాక్టర్లకు కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో డాక్టర్లు ‘పాలివాలెంట్ యాంటీ వీనమ్’ ఇంజెక్షన్ వేస్తారు. ఈ యాంటీ వీనమ్ నాలుగు ప్రధాన విషపూరిత పాముల విషాన్ని హరించగలదు. అయితే.. ఒకే సారి రెండు పాములు కరిచినపుడు ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి

టెక్నాలజీతో ఇంటికి భద్రత

విశాఖ కైలాసగిరిపై భారీ త్రిశూలం ప్రారంభం

Updated Date - May 09 , 2026 | 10:36 AM