Share News

టెక్నాలజీతో ఇంటికి భద్రత

ABN , Publish Date - May 09 , 2026 | 10:19 AM

ఇంటికి తాళం వేసి నిశ్చింతగా ఊర్లకు వెళ్లే రోజులు ఎప్పుడో పోయాయి. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లవుతోంది.

టెక్నాలజీతో ఇంటికి భద్రత
Technology

  • అందుబాటులో అత్యాధునిక పరికరాలు

  • వినియోగించాలంటున్న పోలీసులు

హైదరాబాద్: ఇంటికి తాళం వేసి నిశ్చింతగా ఊర్లకు వెళ్లే రోజులు ఎప్పుడో పోయాయి. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి ఇండ్లకు వారు భద్రత కల్పించుకునే పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఇంటికి ఎంత పెద్ద తాళం వేసినాదొంగలు ఏదో రీతిలో దోచుకు వెళ్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. పోలీసుల గట్టి నిఘా, గస్తీ కారణంగా కొద్దిమేర దొంగతనాలు తగ్గినప్పటికీ ఏదోఒక చోట ఇంటి దోపిడీకి సంబంధించిన సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.


అందుకే వేసవి సెలవుల్లో తీర్థయాత్రలు, టూర్లకు, సొంత ఊర్లకు వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు పత్రికల ద్వార, కరపత్రాల ద్వారా సూచనలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇంటి కిటికీలు, తలుపులు, గేట్లు, ఇంటి పరిసరాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన గాడ్జెట్లు, పరికరాలతో ఇంటిని భద్రంగా కాపాడుకోవచ్చని పోలీసులు సలహా ఇస్తున్నారు. ఇందుకోసం మార్కెట్ల్లో ఎన్నో రకాల సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఇవి నగరంలోని పేరెన్నికగన్న షాపుల్లో వారంటీతో లభ్యమవుతుండగా మరికొందరు ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకుంటున్నారు.


city5.2.jpgమోషన్‌ డిటెక్టర్‌..

మోషన్‌ డిటెక్టర్‌తో దొంగలకు సులభంగా చెక్‌ పెట్టవచ్చు. దొంగలు ఇంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉన్న డోర్స్‌, కిటికీల ఆవరణలో ఈ పరికరాన్ని బిగించుకోవచ్చు. దీని ద్వారాచుట్టుపక్కల ప్రాంతల్లో ఎవరు వచ్చిన అలారం మోగుతుంది. ఇంటికి తాళం పెట్టి లేదా గడియ పెట్టి ఏదైనా పనిపై బయటకువెళ్లినా ఈ పరికరం ఇంటికి రక్షణ కల్పిస్తుంది. ఇంట్లోకి అపరిచితులు ప్రవేశించారని సెల్‌ఫోన్‌లకు సైతం సమాచారం అందిస్తుంది. పోలీసులకు కూడా సిగ్నల్‌ పంపిస్తుంది.


సెక్యూరిటీ షట్టర్స్‌..

దొంగతతనాలకు పాల్పడే దొంగలు ఎక్కువగా కిటికీలోంచి ప్రవేశిస్తుంటారు. కాబట్టి కిటికీలకు, మెయిన్‌ ఎంట్రన్స్‌ వద్ద సెక్యూరిటీ షట్టర్స్‌ను ఏర్పాటు చేసుకుంటే ఇంటికి భద్రత ఉంటుంది. వీటిని ఏర్పాటు చేసుకోవడంతో లోపలికి ప్రవేశించే వీలు ఉండదు. ఈ షట్టర్స్‌ను స్టీలు, అల్యూమినియం పౌడర్‌కోటెడ్‌ ప్రేమ్‌లతో తయారు చేస్తారు. షట్టర్‌లను తెరవడం, మూయడం మాన్యువల్‌గా లేదా రిమోట్‌తో ఆపరేట్‌ చేసుకోవచ్చు. ఈ షట్టర్స్‌ ప్రత్యేకత ఏమిటంటే బయట నుంచి చూస్తున్న వ్యక్తికి ఇంట్లో వ్యక్తులు కనిపించరు. కానీ ఇంట్లోని వ్యక్తికి మాత్రం బయటి వ్యక్తులు పూర్తిగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా ప్రైవసీ కోరుకునే వారికి సెక్యూరిటీ షట్టర్‌లు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి చవకైనవి కావడంతో నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అనేక రకాల డిజైన్లలో ఈ షట్టర్‌లు లభిస్తున్నాయి.


ఆటోమేటిక్‌ సెక్యూరిటీ గేట్‌, సెక్యూరిటీ అలారం..

సెక్యూరిటీ గేట్‌లను మాన్యువల్‌గా లేదా రిమోట్‌తో ఆపరేట్‌ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌ లాక్‌ సౌకర్యం ఉంటుంది. ఇది కరెంటు లేకున్నా బ్యాటరీ సహాయంతోనూ పనిచేస్తుంది. కాబట్టి దొంగలు అంత సులభంగా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు. సెక్యూరిటీ అలారం టెలిఫోన్‌ ఆధారంగా పని చేస్తుంది. ఈ అలారం వ్యవస్థను మీ ఇంటి భద్రతను పర్యవేక్షించే సెక్యూరిటీ కంపెనీలతో లింక్‌ చేస్తారు. ఇకసెక్యూరిటీ కంపెనీలో 24 గంటల పాటు సుశిక్షితులైన గార్డ్‌లు అందుబాటులో ఉంటారు. ఒకవేళ ఇంట్లోకి, ఏదైన వ్యాపార సముదాయం, లేదా కంపెనీలోకి దొంగలు ప్రవేశిస్తే సంబంధిత కంపెనీకి సిగ్నల్స్‌ వెళతాయి. వెంటనే అప్రమత్తం అవుతారు.


జాగ్రత్తలు తీసుకోవాలి

దొంగతనం జరిగాక ఇబ్బందులు పడే కన్నా మార్కెట్‌లో లభ్యమవుతున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన గ్యాడ్జెట్‌లను ఇంటిలో అమర్చుకుంటే మంచిది. వేసవిసెలవుల్లో తీర్థయాత్రలు, సొంత ఊర్లకు వెళ్లే వారు బంగారం, వెండి, డబ్బులు, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిది. ఊరెళుతున్నప్పుడు ఇంటిని గమనిస్తూ ఉండాలని ఇంటి పక్కన వారికి చెప్పడంతో పాటు సమీప పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇస్తే పోలీసులు ఆ ప్రాంతంపై దృష్టి పెట్టి పెట్రోలింగ్‌ చేసే అవకాశం ఉంటుంది.

- సీఐ నర్సింహరాజు


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

గవర్నర్‌ నిర్ణయం సరైనదే!

Read Latest Telangana News and National News

Updated Date - May 09 , 2026 | 10:19 AM