దడపుట్టిస్తున్న నేపాలీ గ్యాంగ్
ABN , Publish Date - May 09 , 2026 | 09:34 AM
హైదరబాద్‌లోని జూబ్లీహిల్స్ వాసులను వరుసగా జరుగుతున్న సంఘటనలు దడపుట్టిస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో ఈ గ్యాంగ్ చేసిన దోపిడీ, దొంగతనం, హత్య వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి.
నిన్నటి వరకు దోపిడీలు.. ఇప్పుడు హత్య
ధనవంతుల నివాసాలే లక్ష్యంగా చేసుకొని పథకాలు
నేపాల్‌లో ఉంటూ నగరంలో ఆపరేషన్
వరుస ఘటనలతో ఉలిక్కి పడుతున్న జూబ్లీహిల్స్
హైదరాబాద్: ‘‘ఫిబ్రవరి 6: నేపాల్‌కు చెందిన భూపేందర్ షాహీ అలియాస్ భువన్ జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్‌లో నివసించే వ్యాపారి ఇంట్లో పనికోసం చేరాడు. నెల రోజులపాటు నమ్మకంగా పనిచేశాడు. యజమాని కుటుంబంతో కలిసి శుభకార్యానికి వెళ్లిన సమయంలో తన జన్మదినం అంటూ మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను మిగతా పనివారికి ఇచ్చాడు. వారు స్పృహ తప్పాక తాళ్లతో కట్టేసి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు అభరణాలను దోపిడీ చేశాడు..’’
‘‘మార్చి 14 జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్.24లో నివాసముండే వ్యాపారి అనిరుద్ద నివాసంలో పదిహేను రోజుల క్రితం పని నిమిత్తం చేరిన నేపాల్‌కు చెందిన సారా, మహే్‌షజ్యోషి యజమాని లేని సమయంలో ఇంట్లో గునపం, ఇతర పనిముట్లు పట్టుకొని గంటపాటు కలిగ తిరిగి లాకర్లు బద్దలు కొట్టి మరీ మూడు కోట్ల రూపాయలు విలువచేసే ఆభరణాలతో పారిపోయారు.’’
‘‘మే 8న విశ్రాంత ఐపీఎస్ భార్య ఇంట్లో పనిచేసే నేపాలీ యువతి మరికొంత మంది సహాయంతో యజమాని లేని సమయంలో అతని భార్యను హత్య చేసింది. నగదు, నగలతో ఉడాయించింది..’’
ఈ వరుస మూడు ఘటనలు జూబ్లీహిల్స్ వాసులను దడపుట్టిస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో ఈ గ్యాంగ్ చేసిన దోపిడీ, దొంగతనం, హత్య వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. ఈ ముఠా పనితీరు రోజురోజుకూ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. విశ్వాసానికి వెన్నుపోటు పొడుస్తూ నేపాలీలు చేస్తున్న ఆకృత్యాలతో వీరిని ఇంట్లో పనికి పెట్టుకోవాలన్నా భయం వేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని పనికి పెట్టుకోవాలి అనే అంశంపై హిల్స్ వాసుల్లో ఆందోళన నెలకొంది. పనిమనిషులు చేతివాటం ప్రదర్శించడం చోరీలు చేయడం హిల్స్‌లో తరుచూ చోటుచేసుకునే ఘటనలే. కానీ దోపిడీలు, హత్యలకు నేపాలీలు తెగబడడం ఇప్పుడు ఆందోళనలకు దారి తీస్తున్నాయి. ధనవంతుల నివాసాలను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేస్తుండడంతో వీరి వెనక ఎవరిదైనా మాస్టర్ మైండ్ పనిచేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేపాలీలను పనిలో పెట్టుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటూ పోలీసులు అనేక సందర్భాల్లో హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారి ఇంట్లో హత్య జరగడం పెను సంచలనం సృష్టిస్తుంది.
ముందు రెక్కీ ఆ తర్వాత దోపిడీలు..
ఒకప్పుడు నేపాలీలు నమ్మకంగా ఉంటూ కాపలా కాసేవారు. నిజానికి ఆరుబయట విలువైన వస్తువులు ఉన్నా తమకేమీ పట్టనట్టు జాగే రహో అంటూ నినాదాలు చేస్తూ నెల కాగానే ప్రతీ ఇంటికి వెళ్లి వంద రూపాయలు తీసుకొని అదే పదివేలుగా భావించేవారు. ఇప్పుడు కొంత మంది నేపాలీ పనివారి అర్థాలే మార్చేశారు. ధనవంతుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నారు. పథకం ప్రకారమే పనివారిగా చేరి ఆ తర్వాత రెక్కీ నిర్వహించి అదను చూసుకొని అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు జరిగిన సంఘటనలను విశ్లేషిస్తే తెలుస్తోంది. నందగిరిహిల్స్‌లో భూపేందర్ షాహీని ఓ మధ్యవర్తి తీసుకువచ్చి పనికి కుదిర్చాడు.
షాహీ యజమాని నగలు ఎక్కడ పెడతాడు అనే విషయంపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు. స్నేహితులతో కలిసి పథకం వేశాడు. ఘటనకు రెండు రోజుల ముందు రెక్కీ నిర్వహించి నగలతో ఉడాయించాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్.24లో చోరీ చేసిన మహే్‌షజ్యోషి, సారాలు కూడా యజమాని వద్ద పదిహేను రోజుల ముందే పనిలో చేరారు. వారికి నగలు ఎక్కడ దాచుతారు అనే విషయం అంతుబట్టలేదు. వారం రోజుల ముందే యజమాని కుటుంబంతో కలిసి ఊటీ వెళుతున్నట్టు తెలుసుకున్న వారిద్దరు మరో ముగ్గురితో కలిసి రెక్కీ నిర్వహించిన అనంతరం ఇళ్లంతా కలియతిరిగి లాకర్లును కొల్లగొట్టి మరీ చోరీ చేశారు. ప్రస్తుత ఐపీఎస్ ఇంట్లో ముందు రోజు రెక్కీ నిర్వహించిన అనంతరమే హత్య, దోపిడీ చేసినట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది.
ముఖియా తరహాలోనే..
రాజస్థాన్‌కు చెందిన ముఖియా గ్యాంగ్ ఒకప్పుడు పోలీసులతో పాటు నగర వాసులను కంటి మీద కునుకు లేకుండా చేసింది. చివరకు పోలీసులు ఆపరేషన్ ముఖియా పేరిట సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి చివరకు గ్యాంగ్‌ను అరెస్టు చేయడం భారీగా సొమ్మును రికవరీ చేశారు. తాజాగా, నేపాలీ గ్యాంగ్ ఇలాంటి సవాలు విసురుతోంది. ముఖియా గ్యాంగ్‌ది రాజస్థాన్‌లోని మారుమూల గ్రామం కాబట్టి పోలీసులు కొంత రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు నేపాలీల విషయంలో ఈ తరహా చర్యలు తీసుకోవాలంటే దేశాల మధ్య ఉన్న ఒప్పందాలు అడ్డువచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి జూబ్లీహిల్స్‌లో జరిగిన చోరీలో అసలు నిందితులు నేపాల్ పారిపోవడంలో సఫలీకృతులయ్యారు. మన పోలీసులు అక్కడకు వెళ్లినప్పటికీ నేరస్థులను నగరానికి తీసుకురాలేకపోయారు. ఇదే అవకాశంగా తీసుకొని నేపాలీ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఆపరేషన్ నేపాల్ పేరిట పోలీసులు కొన్ని బృందాలను నేపాల్‌కు పంపించి గతంలో వివిధ కేసుల్లో ఉన్న వారందరినీ అరెస్టు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టారు.
ఆపరేషన్ అంతా నేపాల్‌లోనే..!
నందగిరిహిల్స్, జూబ్లీహిల్స్ చోరీలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించగా వారు చెప్పిన విషయాలు తెలుసుకొని విస్తుపోయారు. నేపాల్‌లో ఉన్న కొందరు ఈ దోపిడీలకు స్కెచ్ వేస్తున్నట్టు వారి ద్వారా నిర్ధారణ అయింది. పనికి వెళ్లే వారిని ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి చోరీలో పాలుపంచుకునే వారంతా కూడా నేపాల్ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తున్నట్టు తేలింది. చోరీ పూర్తయ్యాక పోలీసుల కళ్లు కప్పి నేపాల్‌కు ఎలా చేరుకోవాలి అనేది కూడా నేపాల్‌లో ఉన్న వారి సూచనల మేరకు జరుగుతోంది. చోరీ చేసిన వారికి ఆశ్రయం ఇచ్చేందుకు పూణె, ముంబైలను షెల్డర్ జోన్‌గా ఈ గ్యాంగ్ వాడుకుంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News