బీటెక్ సెకండియర్‌లో సగానికి పైగా ఫెయిల్ !
ABN , Publish Date - Jun 11 , 2026 | 07:32 AM
జేఎన్‌టీయూ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో వార్షిక పరీక్షా ఫలితాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
జేఎన్‌టీయూ ప్రైవేటు అఫిలియేటెడ్ కాలేజీల ఫలితాల వెల్లడి
వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత 49.88 శాతమే
బయటపడుతున్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల డొల్లతనం
ఆకస్మిక తనిఖీలపై యూనివర్సిటీ ఆడిట్ విభాగం వెనకడుగు
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో వార్షిక పరీక్షా ఫలితాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఓవైపు కార్పొరేట్ కాలేజీల్లో స్పూన్ ఫీడింగ్ విద్యతో రాణించిన విద్యార్థుల్లో ఎక్కువమంది ఇంజనీరింగ్ విద్యలోకి వచ్చేసరికి తొలి రెండేళ్లలోనే పలుమార్లు డమ్కీలు కొడుతున్నారు. మరోవైపు తమ సంస్థలో అన్నీ పర్‌ఫెక్ట్ అని.. గొప్పలు చెప్పుకుంటున్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో.. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం చూస్తే ఎవరికైనా ఉసూరుమనిపిస్తుంది. జేఎన్‌టీయూ పరీక్షల విభాగం తాజాగా విడుదల చేసిన బీటెక్ సెకండియర్ ఫలితాలను పరిశీలిస్తే.. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల చదువేంటో, ఆయా కాలేజీల్లో విద్యా ప్రమాణాలు ఏపాటివో అర్థమవుతుంది.
సెకండియర్‌లో 8,823మంది ఫెయిల్
బీటెక్ సెకండియర్ సెమిస్టర్ ఫలితాలను జేఎన్‌టీయూ మంగళవారం విడుదల చేసింది. ప్రైవేటు అటానమస్ కాలేజీల కంటే అఫిలియేటెడ్ కళాశాలల ఫలితాలు ముందుగా రావడం విశేషమే. అయినప్పటికీ, సెకండియర్ పరీక్షల్లో విద్యార్థుల చాలా తక్కువగా నమోదు కావడం అటు యూనివర్సిటీ అధికారులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 18631మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, అందులో 17,605మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో కేవలం 8,782మంది (49.88శాతం) అన్ని సబ్జెక్టులు పాసయ్యారని, 8,823మంది ఫెయిలైనట్లు పరీక్షల విభాగం ఉన్నతాధికారులు వెల్లడించారు.
గుర్తింపు సమయంలో డమ్మీ ఫ్యాకల్టీలు!
బీటెక్ సెకండియర్‌లో దాదాపు 9వేలమంది ఫెయిల్ కావడానికి కారణాలను పరిశీలిస్తే.. 50శాతం కాలేజీల్లో కొన్ని సబ్జెక్టులను బోధించేందుకు సరైన ఫ్యాకల్టీ లేరని తెలుస్తోంది. ప్రతియేటా అఫిలియేషన్(గుర్తింపు) రెన్యువల్ సమయంలో తనిఖీలకు వచ్చిన జేఎన్‌టీయూ అధికారులకు తాత్కాలికంగా (డమ్మీ) ఫ్యాకల్టీని చూపుతున్న యాజమాన్యాలు.. ఆపై వారికి గుడ్‌బై చెబుతున్నాయి. మరోవైపు కాలేజీ భవనాలను చూసి బాగున్నాయి కదా అని కొన్ని కాలేజీల్లో విద్యార్థులు ఇబ్బడిముబ్బడిగా చేరుతున్నారు.
తీరా చేరాక.. ఆయా కాలేజీల్లో చదువు చెప్పే అధ్యాపకులు లేక, తరగతులు సరిగా జరగక ఇంజనీరింగ్ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలను ఏడాదికి ఒక్కసారే కాకుండా.. ఫిర్యాదులు వచ్చిన కాలేజీల్లో పలుమార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే మేలని విద్యార్థుల తల్లిదండ్రులు జేఎన్‌టీయూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. అయితే, వివిధ కళాశాలల యాజమాన్యాలపై బాధిత ఆచార్యులు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఆకస్మిక తనిఖీలు చేస్తామని నెలరోజుల క్రితమే ప్రకటించిన యూనివర్సిటీ ఆడిట్ సెల్ అధికారులు ఈ దిశగా అడుగు ముందుకు వేయడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News