‘ఉక్కు’ పేరెత్తే అర్హత జగన్‌కు లేదు
ABN , Publish Date - Jun 11 , 2026 | 06:03 AM
విశాఖ ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్‌కు లేదని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్..
ప్రమాదంపై శవ రాజకీయాలు చేయొద్దు
ఐదేళ్లపాలనలో దీక్షా శిబిరాన్నీ సందర్శించని జగన్ : అనిత
విశాఖ ఉక్కును నిలబెట్టింది ఎన్డీఏ ప్రభుత్వమే: పల్లా
విశాఖపట్నం, జూన్ 10(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్‌కు లేదని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్.. కార్మికుల దీక్షా శిబిరాన్నిగాని, కర్మాగారాన్ని గానీ ఒక్కసారి కూడా సందర్శించలేదని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉక్కు కర్మాగారం చరిత్రలో ఎప్పుడు ఇవ్వలేనంత పరిహారం, శాశ్వత ఉద్యోగం మృతుల కుటుంబీకులకు ఇస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారని, ఇందుకు సీఎం చంద్రబాబు చొరవే కారణమన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో యాజమాన్యం రూ.150 కోట్లు ఇస్తే... మృతిచెందిన 12 మందికి రూ.కోటి వంతున జగన్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత చనిపోయిన ఇద్దరికి పరిహారం ఇవ్వలేదు సరికదా తిరిగి వారిపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేసిన ఆందోళనను పట్టించుకోని జగన్...ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది ప్లాంటులో తీవ్రంగా గాయపనడి చనిపోయిన పెంటయ్య కుటుంబానికి ఉద్యోగం, పరిహారం విషయం తన దృష్టికి తీసుకురాలేదని చెప్పారు.