రూ.కోటి పరిహారం ఇవ్వాలి
ABN , Publish Date - Jun 11 , 2026 | 06:05 AM
స్టీల్‌ప్లాంటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి పరిహారం చెల్లించాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో అధికారంలోకి రాగానే మేమిస్తాం
విశాఖలో స్టీల్‌ప్లాంటు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
విశాఖపట్నం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి పరిహారం చెల్లించాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడి విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చి చికిత్స పొందుతున్నవారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత స్టీల్‌ప్లాంటు కార్మిక సంఘాల నేతలతో ఆస్పత్రి లాబీలో 20 నిమిషాలపాటు చర్చించారు. ఆస్పత్రి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ప్లాంటులో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరమని, నాసిరకం ముడిసరుకు వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. మానవత్వం చూపాల్సిన చోట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు అమానవీయంగా ఉందని పేర్కొన్నారు. ‘‘స్టీల్‌ప్లాంటు ప్రమాదంలో మృతి చెందినవారికి రూ.1.72 కోట్లు పరిహారం అందుతుందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించడం సరికాదు. కార్మికులకు ఇన్సూరెన్స్, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి వాటి ద్వారా సహజంగానే రూ.1.45 కోట్లు వస్తుంది. స్టీల్‌ప్లాంటు యాజమాన్యం రూ.25 లక్షలు, పీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి రూ.రెండు లక్షలు అందుతాయి. ఇంక ఇందులో మీరిచ్చేదేముంది...బోడి’’ అని జగన్ వ్యాఖ్యానించారు. గతంలో ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగి 14 మంది మృతిచెందితే వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి చొప్పున అందజేశామన్నారు. ఉక్కు ప్రమాద మృతులకు కూడా అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందజేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఒకవేళ అలా ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇప్పుడు ప్రమాదంలో మరణించిన వారితోపాటు గతంలో మృతిచెందినవారి కుటుంబాలకు కూడా రూ.కోటి చొప్పున కుటుంబాలకు అందజేస్తామని వెల్లడించారు.