Share News

ఓయూలో మూల్యాంకనం ఓ మాయ!

ABN , Publish Date - Jun 11 , 2026 | 08:01 AM

ఉస్మానియా యూనివర్సిటీలోని న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

ఓయూలో మూల్యాంకనం ఓ మాయ!
Osmania University

  • పేపర్లు దిద్దుతున్నారా అని అనుమానాలు

  • ఎల్‌ఎల్‌బీ లేబర్‌ లా-1 సబ్జెక్ట్‌లో ఏకంగా 1,500 మంది ఫెయిల్‌

  • ఫస్ట్‌క్లాస్‌ వచ్చేవాళ్లూ ఉత్తీర్ణులు కాలేదు

  • రీవాల్యూయేషన్‌కు 1,000 మంది దరఖాస్తు.. అందరూ పాస్‌

  • 8 మందికి ఫస్ట్‌ గ్రేడ్‌

  • మూల్యాంకనంలో తప్పిదాలతో విద్యార్థుల జీవితాలపై ప్రభావం

హైదరాబాద్‌ సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలోని న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఎల్‌ఎల్‌బీ ఫస్ట్‌ సెమిస్టర్‌లో కూడా ఏ గ్రేడ్‌ సాధించాడు. రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ అన్ని పరీక్షల్లో ఏ గ్రేడ్‌ సాధించినా ‘లేబర్‌ లా-1’ సబ్జెక్ట్‌లో మాత్రం ఫెయిలైనట్లు వచ్చింది. దాంతో ఆ విద్యార్థి పునర్‌ మూల్యాంకనం (రీ వాల్యూయేషన్‌) కోసం దరఖాస్తు చేసుకోగా ఏ గ్రేడ్‌లో పాసైనట్లు ప్రకటించారు. ఇలా ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం లేబర్‌ లా-1 సబ్జెక్ట్‌లోనే దాదాపు 1,500 మంది ఫెయిలైనట్లు తెలిసింది.


ఇందులో 1,000మంది వరకు రూ.700 చెల్లించి రీ వాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో పేపర్లు గుడ్డిగా దిద్దుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఏదైనా సబ్జెక్ట్‌లో ఫెయిలైనా, మార్కులు తక్కువగా వచ్చినా రీవాల్యూయేషన్‌ పెట్టుకుంటే నాలుగైదు మార్కులకు మించి పెరగవు. కానీ ఉస్మానియా ఎల్‌ఎల్‌బీ లేబర్‌ లా-1లో ఫెయిలైన విద్యార్థుల్లో రీవాల్యూయేషన్‌తో 8మంది ఏ గ్రేడ్‌, 141మంది బీ గ్రేడ్‌, 158మంది సీ గ్రేడ్‌, 93మంది డీ గ్రేడ్‌లో ఉతీర్ణత సాధించారు.


city3.2.jpgమూల్యాంకనంలో తప్పిదాలు విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. ఎల్‌ఎల్‌బీ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించే విద్యార్థులు జూనియర్‌ జడ్జి, సివిల్‌ జడ్జి లాంటి పోస్టులకు అర్హత సాధిస్తారు. అయితే, వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల పలువురు విద్యార్థుల గ్రేడ్‌లు పడిపోతున్నాయి. ఎల్‌ఎల్‌బీయే కాకుండా పలు కోర్సుల్లో కూడా మూల్యాంకనంలో తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. రీవాల్యూయేషన్‌ చేయించుకున్న విద్యార్థులు పాస్‌ అవుతుండగా చేయించుకోని విద్యార్థులు నష్టపోవాల్సిందేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


ఎల్‌ఎల్‌బీ మూడో సెమిస్టర్‌లో జరిగిన తప్పిదాలపై విద్యార్థులు వీసీకి, రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా, అనుబంధ లా కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సును దాదాపు 2,500 మంది చదువుతున్నారు. ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఫిబ్రవరిలో జరగ్గా ఫలితాలను ఏప్రిల్‌ 16న విడుదల చేశారు. ఫలితాలను 35-40 రోజుల్లో విడుదల చేయాల్సి ఉండగా రెండు నెలలకు పైగా తీసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 08:01 AM