Share News

పరామర్శా? బల ప్రదర్శనా?

ABN , Publish Date - Jun 11 , 2026 | 06:08 AM

మాజీ సీఎం జగన్‌ విశాఖ పర్యటన సందర్భంగా బుధవారం ఆ పార్టీ నేతలు డబ్బులిచ్చి జన సమీకరణకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.

పరామర్శా? బల ప్రదర్శనా?

  • డబ్బులిచ్చి జన సమీకరణ చేసిన స్థానిక నేతలు

  • అయినా పెద్దగా ఆసక్తి చూపని జనం

మాజీ సీఎం జగన్‌ విశాఖ పర్యటన సందర్భంగా బుధవారం ఆ పార్టీ నేతలు డబ్బులిచ్చి జన సమీకరణకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఉక్కు ప్రమాద బాధితులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపి వెళ్లిపోవాల్సిన జగన్‌...తన పర్యటనను రాజకీయ కార్యక్రమంగా మార్చివేశారు. ఇందులోభాగంగా క్షతగాత్రులను పరామర్శించేందుకు సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రికి వస్తున్న జగన్‌కు భారీగా జనాలతో స్వాగతం పలకడంతోపాటు ‘సీఎం...సీఎం’ అంటూ నినాదాలు చేసేలా వైసీపీ నేతలు వ్యూహం పన్నారు. దీనికోసం డబ్బులిచ్చి జనాలను సమీకరించాలని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి పరిసర ప్రాంతాల నేతలకు ఆదేశాలు జారీచేశారు. అయితే వైసీపీ నేతలు డబ్బులిస్తామని చెప్పినా, జనాలు ఆసక్తి చూపకపోవడంతో ఆ పార్టీనేతలు కంగుతిన్నారు. ఉన్న కొద్దిమంది జనాన్ని ఆస్పత్రి గేటు వద్ద మోహరించి ‘సీఎం...సీఎం’ అంటూ నినాదాలు చేయించారు.


  • పక్క నుంచి జగన్‌కు ఫీడ్‌ బ్యాక్‌

  • సొంతంగా పట్టుమని పది నిమిషాలూ మీడియాతో మాట్లాడలేకపోయిన నేత

క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మాజీ సీఎం జగన్‌ సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు ఎలా సహాయం చేసిందీ...స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఏం చేసిందీ చెప్పుకొచ్చారు. అయితే, ఒక వాక్యం మాట్లాడిన తర్వాత మరొక వాక్యం మాట్లాడేముందు పక్కనున్న పార్టీ నేతల నుంచి సూచనలు తీసుకున్నారు. ఒక అంశంపై పట్టుమని పది నిమిషాలు కూడా జగన్‌ మాట్లాడలేకపోవడం చూసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం ఆశ్చర్యపోయారు.

Updated Date - Jun 11 , 2026 | 06:10 AM