Share News

ఉస్మానియా పరీక్షల విభాగం ఫెయిల్‌

ABN , Publish Date - Aug 12 , 2026 | 10:33 AM

ఉస్మానియా యూనివర్సిటీలోని పరీక్షల విభాగం ఫెయిల్‌ అయ్యింది. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు అన్నింటిలోనూ అదే పరిస్థితి.

ఉస్మానియా పరీక్షల విభాగం ఫెయిల్‌
Osmania University

  • విద్యా సంవత్సరం వృథా కాకుండా చర్యల్లేవ్‌

  • నిర్ణీత గడువులో ఎగ్జామ్స్‌ కరువు

  • ఒక వేళ నిర్వహించినా ఫలితాలు విడుదల కావు

  • రిజల్ట్స్‌ వచ్చినా మార్కులన్నీ లోప భూయిష్టం

హైదరాబాద్‌ సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలోని పరీక్షల విభాగం ఫెయిల్‌ అయ్యింది. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు అన్నింటిలోనూ అదే పరిస్థితి. పరీక్ష ఫలితాలను విడుదల చేసినా విద్యార్థులకు వచ్చే మార్కులన్నీ లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. వర్సిటీ పరీక్షల విభాగం తీరుతో యూనివర్సిటీతో పాటు అనుబంధ కాలేజీలో చదివే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.


ఫలితాలు తారుమారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలున్నాయి. ఆయా జిల్లాల పరిధిలోని దాదాపు 700 కాలేజీల వరకు ఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా ఉన్నాయి. అందులో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు బీఎస్సీ, బీకామ్‌, బీఏ, బీబీఏ కోర్సులను లక్షలాది మంది చదువుతున్నారు. కానీ కొవిడ్‌-19 తర్వాత పరీక్షల నిర్వహణలో, ఫలితాల విడుదలలో ఉస్మానియా యూనివర్సిటీ పూర్తిగా విఫలమవుతోంది. సకాలంలో పరీక్షలు నిర్వహించడం లేదు. ఫలితాలు విడుదల చేయడం లేదు. ఒకవేళ ఫలితాలు విడుదల చేసినా రీవాల్యువేషన్‌ విద్యార్థులు పెట్టుకుంటేనే అసలు ఫలితాలు వస్తున్నాయి. లేకుంటే ఏ గ్రేడ్‌లో పాసయ్యే విద్యార్థులు సైతం ఫెయిల్‌ అవుతున్నారు. ఇటీవల ఎల్‌ఎల్‌బీ రెండో సెమిస్టర్‌ ఫలితాల్లో వేలాది మంది విద్యార్థులను ఫెయిల్‌ చేయడం, రీవాల్యువేషన్‌తో ఏ గ్రేడ్‌తో ఉతీర్ణులు చేసిన విషయం విధితమే.


విద్యా సంవత్సరం వృథా అవుతుందని..

యూనివర్సిటీ పరీక్షల విభాగం నిర్లక్ష్యం వల్ల వేలాది మంది విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరాన్ని వృథా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ఎంబీఏ కోర్సు ప్రవేశాలు నెలక్రితమే పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఎంబీఏ సీట్లను భర్తీ చేసేందుకు ఐసెట్‌ నిర్వహించి మొదటి దశ కౌన్సిలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. రెండో దశ కౌన్సిలింగ్‌ ప్రక్రియకు మరో వారం రోజుల తర్వాత నిర్వహించే అవకాశాలున్నాయి.


కానీ బీబీఏ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (క్యూట్‌) రాసి మంచి ఫలితాలు సాధించిన నిరాశ చెందారు. ప్రస్తుతం ఐసెట్‌లో కూడా మంచి ర్యాంకులు వచ్చినా చివరి సెమిస్టర్‌ ఫలితాలు రాకపోవడంతో సర్టిఫికేషన్‌ వెరిపికేషన్‌లోనే తిరస్కరిస్తున్నారు. ఐసెట్‌ కౌన్సిలింగ్‌ సందర్భంగా నగరంలోని బాగ్‌లింగంపల్లిలో గల ఓ కాలేజీలో విద్యార్థుల సర్టిఫికెట్లను వెరిఫై చేశారు. కానీ బీబీఏ ఉత్తీర్ణత సాధించిన్నట్లుగా ఎలాంటి సర్టిఫికేట్‌ లేకపోవడంతో ఐసెట్‌ ద్వారా అడ్మిషన్‌కు అనుమతివ్వడం లేదు.


city2.2.jpgప్రైవేటు కాలేజీల్లో చదివిన వారు విద్యా సంవత్సరం వృథా గాకుండా ఎక్కడో ప్రైవేటు కాలేజీలో అడ్మిషన్‌ పొందుతారని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి బీబీఏ చదువుతున్న తాము లక్షల్లో ఫీజులు చెల్లించి చదువలేమని బేగంపేట ఉమెన్స్‌ కాలేజీ విద్యార్థినులు వాపోతున్నారు. మరో ఐదు రోజుల్లో ప్రారంభమయ్యే ఐసెట్‌ రెండో విడుత కౌన్సిలింగ్‌ వరకు పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని, లేకుంటే పరీక్షల విభాగం నిర్లక్ష్యం వల్ల విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని కన్నీళ్లు పెడుతున్నారు.


ఆరు నెలలైనా..

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిజాం కాలేజీ, బేగంపేట ఉమెన్స్‌ కాలేజీలతో పాటు దాదాపు 190 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీబీఏ) కోర్సు ఉన్నది. ఒక్కో కాలేజీలో 60 సీట్ల నుంచి 120 సీట్ల వరకు ఉన్నాయి. బీబీఏ కోర్సు సీట్లు ప్రతీ సంవత్సరం దాదాపుగా నిండుతాయి. కొన్ని ప్రైవేటు కాలేజీల్లోనే మిగులుతాయి. బీబీఏ కోర్సులో ఏడాదికి 8 వేల మంది వరకు చదువుతుండగా, మూడేళ్లలో ఈ కోర్సులో దాదాపు 24 వేల మంది వరకు ఉంటారు.


అయితే 2025-26 విద్యా సంవత్సరానికి బీబీఏ చివరి సంవత్సరం చదివిన వేలాది మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం నిర్లక్ష్యం వల్ల ఉన్నత విద్యను చదవలేకపోతున్నారు. బీబీఏ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు గతేడాది డిసెంబర్‌లో ఐదో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించగా ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయలేదు. ఈ ఏడాది జూన్‌ చివరి వారం నుంచి ఆరో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించగా ఇక ఆ ఫలితాలు ఎప్పుడూ వస్తాయో తెలియదు.


ఈ వార్తలు కూడా చదవండి:

బాల్యంలో లైంగిక దాడి.. 15 ఏళ్ల తర్వాత సవతి సోదరుడిపై యువతి కేసు..

వికారాబాద్‌ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 10:33 AM