Share News

రామమందిర సీఈఓ పోస్టు.. తొలి రోజు 10 మందికి ఇంటర్వ్యూలు

ABN , Publish Date - Aug 12 , 2026 | 09:30 AM

అయోధ్య రామమందిర వ్యవహారాలను పర్యవేక్షించే సీఈఓ ఎంపిక కోసం ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అభ్యర్థులను ఇంటర్వ్యూ పానల్ వివిధ రకాల ప్రశ్నలను అడిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

రామమందిర సీఈఓ పోస్టు.. తొలి రోజు 10 మందికి ఇంటర్వ్యూలు
Ram Mandir CEO Job Interviews

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామమందిర వ్యవహారాలను పర్యవేక్షించే సీఈఓ ఎంపిక కోసం ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అయోధ్య రామ మందిర ప్రాంగణంలో నిన్న (మంగళవారం) మొదలైన ఇంటర్వ్యూలు నేడూ కొనసాగనున్నాయి. ఇంటర్వ్యూల సందర్భంగా అభ్యర్థులు తమ పరిపాలనా దక్షతకు, అనుభవం, కుటుంబ వివరాలు, మత విశ్వాసాలకు సంబంధించి పలు ప్రశ్నలు ఎదుర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


మంగళవారం మొత్తం 10 మందికి ఇంటర్వ్యూలు జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వృత్తిపరమైన అనుభవం, మతవిశ్వాసాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి వివరాలను గూగుల్ ఫార్మ్‌లో నింపాలని అభ్యర్థులను ఇంటర్వ్యూ పానల్ కోరిందని తెలుస్తోంది. అభ్యర్థులు తమ సీవీలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఇంటర్వ్యూ సాగిందని సమాచారం. మీరు శిఖ పెట్టుకుంటారా? జంధ్యం ధరిస్తారా? మీరు శాకాహారులా? మాంసాహారులా అన్న ప్రశ్నలను ఇంటర్వ్యూ ప్యానల్ అడిగినట్టు తెలుస్తోంది.

అభ్యర్థులకు మద్యం సేవించే అలవాటు ఉందా? అని ప్యానల్ అడిగినట్టు సమాచారం. గత పని అనుభవం, కుటుంబ నేపథ్యం, దేవాలయంలో భక్తుల రద్దీ నిర్వహణకు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగారు. రామమందిరానికి ఉన్న మతపరమైన, సామాజికపరమైన ప్రాముఖ్యం గురించి కూడా ప్యానల్ ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది.


అభ్యర్థుల పరిపాలన దక్షత, నాయకత్వ సామర్థ్యాలు, దేవాలయ భవిష్యత్తు విషయంలో వారి ఆలోచనలు తెలుసుకునేలా ఇంటర్వ్యూ సాగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిన్న 10 మంది అభ్యర్థుల ఇంటర్వ్యూలు పూర్తిగా కాగా నేడు మిగిలిన 8 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేదీ, షిరిడీ సాయిబాబా ట్రస్టు మాజీ చైర్మన్ సురేశ్ హవారే ఈ ఇంటర్వ్యూ పానల్‌లో సభ్యులుగా ఉన్నారు.

నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఇంటర్వ్యూలు మధ్యాహ్నం వరకూ సాగాయి. ఆ తరువాత మధ్యాహ్నం రెండు నుంచి సాయంతం 6 గంటల వరకూ కొనసాగాయి. ఒక్కో అభ్యర్థిని సుమారు అరగంట పాటు ఇంటర్వ్య చేసినట్టు తెలుస్తోంది. దేవాలయ వ్యవహారాల పర్యవేక్షణకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తొలిసారిగా సీఈఓను నియమించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇటీవల వెలుగు చూసిన విరాళాల చోరీ నేపథ్యంలో ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

అదానీకి భారీ ఊరట

Updated Date - Aug 12 , 2026 | 10:57 AM