ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Aug 12 , 2026 | 08:34 AM
తుర్కియేలో నాటో సమావేశాల అనంతరం సీక్రెట్‌గా ఓ ప్లేన్‌లో అమెరికాకు వెళ్లిపోయిన విషయాన్ని ట్రంప్ తాజాగా అంగీకరించారు.
ఇంటర్నెట్ డెస్క్: తుర్కియేలో నాటో సమావేశాల అనంతరం సీక్రెట్‌గా ఓ ప్లేన్‌లో స్వదేశానికి వెళ్లిపోయిన విషయాన్ని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంగీకరించారు. తనకు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న రీత్యా అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన లాంటి ప్రభావశీల అధ్యక్షులకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం సర్వసాధారణమని కూడా అన్నారు.
శత్రుమూకలను తప్పుదారి పట్టించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ను అధికారిక ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో కాకుండా మరో చిన్న విమానంలో తుర్కియే నుంచి తరలించినట్టు అమెరికా మీడియాలో తొలుత కథనాలు వెలువడ్డాయి. చివరి నిమిషంలో ఈ మార్పు జరిగినట్టు కూడా వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయంలో ఎయిర్ ఫోర్స్ వన్ ఉన్న సమయంలోనే భద్రతా అధికారులు క్యాటరింగ్ ట్రక్‌లో (ఆహారాన్ని తరలించే ట్రక్) ట్రంప్‌ను సీక్రెట్‌గా మరో చిన్న మిలిటరీ విమానంలోకి తరలించి దేశాన్ని దాటించారు.
ఈ ఉదంతంపై ట్రంప్ మాట్లాడుతూ భద్రతా అధికారుల సూచనలను యథాతథంగా అనుసరించానని చెప్పారు. తనకు ఎలాంటి ముప్పు ఉందనే విషయంపై వారిని ఎక్కువ ప్రశ్నలేవీ అడగలేదని చెప్పారు. ‘మరో విమానంలో వెళ్లాలని వాళ్లు చెప్పారు. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తుంటా. ఈసారి కూడా ఎక్కువ ప్రశ్నలు అడగలేదు. అయితే, నాకు ఇలాంటి ముప్పు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది’ అని ట్రంప్ అన్నారు. కానీ తాను ప్రయాణించిన మిలిటరీ విమానంలోనే రిస్క్ ఎక్కువ అని అన్నారు. అలాంటి వాటినే శత్రుమూకలు అధికంగా టార్గెట్ చేస్తాయని చెప్పారు. అమెరికా అధ్యక్షులకు ఇలాంటి బెదిరింపులు రావడం ఒకరకంగా చూస్తే సాధారణమేనని కూడా అన్నారు. ‘నాకు ఇంకా ఇలాంటి అనేక సమస్యలు పొంచి ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. అయినా, నాలాంటి ప్రభావశీల అధ్యక్షులకు ఇది సర్వసాధారణం’ అని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫుడ్ ట్రక్కులో దాక్కుని తుర్కియే నుంచి తప్పించుకున్న ట్రంప్..