ఫుడ్ ట్రక్కులో దాక్కుని తుర్కియే నుంచి తప్పించుకున్న ట్రంప్..
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:31 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియే పర్యటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియా సంస్థ 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియే పర్యటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియా సంస్థ 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనాన్ని ప్రచురించింది. గత జులై నెలలో నాటో సదస్సులో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌పోర్టులోని ఫుడ్ ట్రక్కులో దాక్కోవాల్సి వచ్చిందని సదరు మీడియా సంస్థ పేర్కొంది. ఆయన ఎయిర్‌ఫోర్స్ వన్‌లో కాకుండా ఓ చిన్న మిలిటరీ విమానంలో రహస్యంగా తుర్కియే నుంచి బ్రిటన్ ప్రయాణించారని వెల్లడించింది.
'వాషింగ్టన్ పోస్ట్' కథనం మేరకు.. నాటో సదస్సు కోసం ట్రంప్ మొదట ఖతార్ దేశం బహుమతిగా ఇచ్చిన అత్యాధునిక కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తుర్కియే వెళ్లారు. అయితే, ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న తుర్కియేలో ఈ కొత్త విమానం భద్రతపై నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పక్కా వ్యూహం ప్రకారం.. అంకారా విమానాశ్రయంలో కెమెరాల ముందు ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కారు. ట్రంప్ లోపలికి వెళ్లిన వెంటనే.. ఎవరికీ అనుమానం రాకుండా ఎయిర్‌పోర్ట్ క్యాటరింగ్ ట్రక్కు సహాయంతో రన్‌వేపై సిద్ధంగా ఉన్న చిన్న మిలిటరీ విమానంలోకి ఆయనను మార్చారు.
ట్రంప్‌తో పాటు ప్రయాణిస్తున్న మీడియా ప్రతినిధులు, వైట్ హౌస్ సిబ్బంది అంతా అధ్యక్షుడు 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానంలోనే ఉన్నారని భావించారు. కానీ, ఆ పెద్ద విమానం టేకాఫ్ అవ్వడానికి ముందే ట్రంప్ ఉన్న చిన్న మిలిటరీ విమానం రహస్యంగా బ్రిటన్ వైపు దూసుకెళ్లింది. అదే రోజు రాత్రి 10:20 గంటలకు ట్రంప్ ఉన్న చిన్న మిలిటరీ విమానం సురక్షితంగా బ్రిటన్‌లోని 'రాఫ్ మైల్డెన్‌హాల్' వైమానిక స్థావరానికి చేరుకుంది.
ఇవి కూడా చదవండి
గుడిమల్కాపూర్‌లో బాలుడిపై తండ్రి దాడి ఘటన.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి
వన్డే ప్రపంచ కప్ 2027: వెస్టిండీస్‌కు షాక్.. డైరెక్ట్ క్వాలిఫికేషన్ మిస్