వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు
ABN , Publish Date - Aug 12 , 2026 | 09:02 AM
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నకిలీ డీఏపీ ఎరువును రైతులు పట్టుకున్నారు. వాటిని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు.
వికారాబాద్, ఆగస్టు12: రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో నకిలీ ఎరువు వెల్లువెత్తింది. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నకిలీ డీఏపీ ఎరువును రైతులు పట్టుకున్నారు. వాటిని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో నకిలీ డీఏపీ ఎరువును వరంగల్‌లోని ఎఫ్‌సీవో ల్యాబ్ (FCO - Fertilizer Control Order)కు తరలించారు. ఈ నేపథ్యంలో ల్యాబ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వెలువడే ఫ్లైయాష్, ఉప్పు ద్రావణంతో ఈ నకిలీ డీఏపీ ఎరువును తయారు చేస్తున్నట్లు ఎఫ్‌సీవో గుర్తించింది.
18 శాతం ఉండాల్సిన నైట్రోజన్ 1.12 శాతం, 46 శాతం ఉండాల్సిన ఫాస్పరస్ 0.77 శాతం మాత్రమే నమోదయినట్లు గుర్తించారు. ఎఫ్‌సీవో ల్యాబ్ పరీక్షల్లో ఈ నకిలీ డీఏపీ.. పూర్తిగా నాన్ స్టాండర్డ్ అని తేల్చారు. కేవలం వాసన కోసం రసాయనాలు కలిపి.. ఆ బస్తాల్లో ఫ్లైయాష్ నింపుతున్నట్లు కనుగొన్నారు. అయితే ఈ నకిలీ డీఏపీ మార్కెట్‌ను ముంచెత్తినా.. కేవలం ఇద్దరిపైన మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు.
అలాగే దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు కూడా స్పందించడం లేదు. దీంతో పోలీసులు, ఉన్నతాధికారుల వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. రైతులకు ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ నకిలీ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రజాసంఘాల డిమాండ్ చేస్తున్నాయి. అలాగే నకిలీ డీఏపీ కొనుగోలు చేసిన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయం.. దర్యాప్తు ముమ్మరం
ఎల్బీనగర్ పీఎస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య..
For More TG News And Telugu News