పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయం.. దర్యాప్తు ముమ్మరం
ABN , Publish Date - Aug 12 , 2026 | 08:24 AM
హైదరాబాాద్ పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయం కేసులో దర్యాప్తును బంజారాహిల్స్ పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను క్లూస్ టీంతో వారు సేకరించారు.
హైదరాబాద్, ఆగస్టు12: నగరంలోని పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయం కేసులో దర్యాప్తును బంజారాహిల్స్ పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను క్లూస్ టీంతో వారు సేకరించారు. శిశువు మృతదేహం పూడ్చిన ప్రదేశంలో వస్త్రం, చిన్న కాళ్లు, మాంసపు ముద్దలను ఈ సందర్భంగా క్లూస్ టీం గుర్తించింది. వాటిని డీఎన్‌ఏ పరీక్షలకు పోలీసులు పంపారు.
అయితే లభ్యమైన కాళ్లు, మాంసపు ముద్దలు పసికందు మృతదేహానివేనా..?, ఓ వేళ వాటిని కుక్కలు తిన్నాయా..? లేకుంటే ఇతర కారణం ఏదైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిజానిజాలు తేల్చేందుకు ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నివేదికలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో ఇప్పటికే సేకరించిన సాంకేతిక ఆధారాలను కూడా వారు పరిశీలిస్తున్నారు.
మృతదేహం మాయమైన ఘటన యాదృచ్ఛికమా..? కుట్ర కోణం ఉందా..? అని లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్‌ఏ, ఫోరెన్సిక్ నివేదికలతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి పలువురు అనుమానితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
పాతబస్తీ చార్మినార్‌లోని ఝాన్సీబజార్‌కు చెందిన దంపతులకు ఆరు నెలల క్రితం కవలలు పుట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ గత శనివారం ఓ పసికందు మృతి చెందింది. దీంతో పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఖననం చేశారు. మరో చిన్నారి ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది.
సోమవారం (10-08-2026 ) రెండో పసికందు అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులు శ్మశానవాటికకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మొదటి చిన్నారిని పూడ్చిన ప్రాంతంలో గుంత తీసి ఉండటాన్ని వారు గుర్తించారు. గోతిలో మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు.
రెండో పసికందు అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత.. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా శ్మశానవాటిక కాపరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్బీనగర్ పీఎస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య..
ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబుపై రాళ్లదాడి.. సుప్రీంకోర్టులో విచారణ
For More TG News And Telugu News