ఇంటర్నల్స్‌లో సున్నా మార్కులు
ABN , Publish Date - May 06 , 2026 | 08:41 AM
జేఎన్‌టీయూ విద్యార్థులకు యూనివర్సిటీ పరీక్షల విభాగం షాక్‌ల మీద షాకులు ఇస్తోంది.
జేఎన్‌టీయూలో ఆచార్యుల నిర్లక్ష్యం
విద్యార్థుల పాలిట శాపం
ఎవరికివారే తప్పించుకునే యత్నం
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ విద్యార్థులకు యూనివర్సిటీ పరీక్షల విభాగం షాక్‌ల మీద షాకులు ఇస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఎంటెక్ ఫలితాలను చూసుకొని ప్రైవేటు కాలేజీల విద్యార్థులే కాదు.. క్యాంప్‌సలోని అనుబంధ కళాశాల విద్యార్థులు కూడా బెంబేలెత్తుతున్నారు. కొంతమంది విద్యార్థులకు ఎక్స్‌టర్నల్ పరీక్షల్లో సింగిల్ డిజిట్ మార్కులు రాగా, మరికొందరికి ఇంటర్నల్ పరీక్షల్లో జీరో మార్కులు వేయడం విడ్డూరంగా ఉందని విద్యార్థి సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. ఎంసెట్, పీజీఈసెట్‌లలో టాప్ ర్యాంకులు తెచ్చుకున్న అభ్యర్థులకు ఇటువంటి దయనీయమైన పరిస్థితి ఏర్పడడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సున్నా మార్కులా?
కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంటెక్ చదువుతున్న కొందరు విద్యార్థులకు మొదటి సెమిస్టర్ ఇంటర్నల్ పరీక్షల్లో సున్నా మార్కులు వేయడాన్ని విద్యార్థి సంఽఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. అన్ని సబ్జెక్టుల్లో ఎక్స్‌లెంట్ (ఏప్లస్), ఔట్‌స్టాండింగ్ (ఓ) గ్రేడ్‌లతో పాసైన విద్యార్థులను ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో సున్నా మార్కులు వేసి ఫెయిల్ చేయడం పరిపాటిగా మారిందని అంటున్నారు. ఇదేంటని అడిగితే రూ.3వేలు చెల్లించి రీవాల్యుయేషన్ పెట్టుకోమని పరీక్షల విభాగం ఉన్నతాధికారులు ఉచిత సలహా ఇస్తున్నారేగానీ, విద్యార్థుల సమస్యను అర్ధం చేసుకొని పరిష్కారం చూపలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాధిత విద్యార్థులు కొందరు తమ విభాగాధిపతులను కలిస్తే పరీక్షల విభాగాన్ని సంప్రదించమంటుండగా, అక్కడికి వెళితే తమ విభాగానికి సంబంధం లేదని సిబ్బంది చెబుతుండడంతో వారి గోడు ఆలకించే నాధుడు కరువయ్యారు. విద్యార్థులు తప్పు చేస్తే జరిమానాలు, శిక్షలు వేసే వర్సిటీ యాజమాన్యం, ఆచార్యుల/అధికారుల నిర్లక్ష్యం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుండడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. బాధిత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి, తక్షణ పరిష్కారం చూపాలని వైస్‌చాన్స్‌లర్‌ను కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ఆగని అవినీతి.. రేటు కట్టి పౌర సేవలు
Read Latest Telangana News and National News