పంజాబ్‌లో రెండు భారీ పేలుడు ఘటనలు.. అప్రమత్తమైన భద్రతా దళాలు..
ABN , Publish Date - May 06 , 2026 | 07:35 AM
పంజాబ్ రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో పేలుడు ఘటనలు పంజాబ్ వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. నిన్న (బుధవారం) రాత్రి జలంధర్, అమృత్‌సర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా పేలుళ్లు జరగడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
పంజాబ్: రెండు వేర్వేరు ప్రాంతాల్లో పేలుడు ఘటనలు పంజాబ్ వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. నిన్న (బుధవారం) రాత్రి జలంధర్, అమృత్‌సర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా పేలుళ్లు జరగడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. మొదట జలంధర్‌లోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రధాన కార్యాలయం వెలుపల పేలుడు జరగగా.. గంటల వ్యవధిలోనే అమృత్‌సర్ ఖాసా ప్రాంతంలోని సైనిక శిబిరానికి సమీపంలో మరో పేలుడు జరిగింది.
జలంధర్‌లో బుధవారం రాత్రి సుమారు 8:15 గంటల ప్రాంతంలో పార్క్ చేసిన ద్విచక్రవాహనం పేలిపోయింది. బీఎస్ఎఫ్ పంజాబ్ ప్రధాన కార్యాలయం బయట పార్క్ చేసిన స్కూటర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఈ పేలుడు ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జలంధర్ ఘటన జరిగిన కొన్ని గంటలకే అమృత్‌సర్‌లోని ఖాసా ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. రాత్రి సుమారు 10:30 గంటల ప్రాంతంలో సైనిక శిబిరం సమీపంలో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి క్యాంపస్ గోడలు సైతం కంపించాయి. దీని శబ్దం కిలోమీటరు పైగా వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కూడా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించలేదు.
ఈ రెండు సంఘటనలతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఘటనా స్థలాలకు చేరుకుని పేలుళ్లకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగి సాక్ష్యాలను సేకరిస్తున్నాయి. ఈ రెండు పేలుళ్ల మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే విషయాన్ని కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో పేలుడు జరిగిన ప్రాంతాలు సహా పంజాబ్ వ్యాప్తంగా అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేజ్రీవాల్ తరఫున వాదనలకు కోర్టే లాయర్లను నియమిస్తుంది
సర్కారు ఏర్పాటుకు సై..!