Share News

సర్కారు ఏర్పాటుకు సై..!

ABN , Publish Date - May 06 , 2026 | 07:21 AM

తమిళనాడు ముఖ్యమంత్రిగా ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, ప్రముఖ సినీనటుడు విజయ్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారని.. పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన ఆయన...

సర్కారు ఏర్పాటుకు సై..!

గవర్నర్‌కు విజయ్‌ సమాచారం.. రేపు ఉదయం 11.30కి ప్రమాణం

అవకాశమివ్వాలని గవర్నర్‌కు అభ్యర్థన

ఆచితూచి స్పందించిన అర్లేకర్‌

సంఖ్యాబలం చూపించాకే ఆహ్వానంపై నిర్ణయం

విజయ్‌ని కలిసేదీ అప్పుడే అని స్పష్టీకరణ

టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్‌ ఎన్నిక

మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఆ పార్టీ

కాంగ్రెస్‌, పీఎంకే, వీసీకే, లెఫ్ట్‌తో చర్చలు!

మంత్రి పదవులిస్తామని హామీ

విజయ్‌ మాతో మాట్లాడారు: వేణుగోపాల్‌

సీఎం పదవికి స్టాలిన్‌ రాజీనామా.. ఆమోదం

చెన్నై, మే 5 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రిగా ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, ప్రముఖ సినీనటుడు విజయ్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారని.. పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన ఆయన బుధవారం రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌తో సమావేశమవుతారని టీవీకే నాయకత్వం ప్రకటించింది. కానీ అంతలోనే గవర్నర్‌ ఆయనకు ఝలక్‌ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ఆయన ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించాలని టీవీకే నేతలు కోరగా.. మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య తదితర వివరాలు అడిగానని.. వాటి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆ వివరాలు సమర్పించాకే విజయ్‌తో భేటీ అవుతానని స్పష్టం చేశారు. టీవీకే తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలు, ఆ పార్టీకి మద్దతిచ్చే పార్టీల సభ్యుల వివరాలను తెలిపిన మీదటే తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఆ పార్టీ ప్రతినిధులెవరూ తనను కలువలేదని.. కొన్ని సమాచారాలను మాత్రమే పంపారని, అందులో తమ పార్టీ ఎంత శాతం ఓట్లు సంపాదించిందన్న వివరాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అధికారికంగా అన్ని వివరాలతో లోక్‌భవన్‌ అధికారులను సంప్రదించాలని వారికి సూచించానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై టీవీకే స్పందించింది. గవర్నర్‌ అడిగిన వివరాలన్నీ అందించామని, అధిక సంఖ్యాబలమున్న పార్టీ తమదేనంటూ గణాంకాలతో పంపామని స్పష్టం చేసింది. బుధవారం ఆయన అపాయింట్‌మెంట్‌ కోరామని, అంతేగాక గురువారం ఉదయం 11.30 గంటలకు విజయ్‌తో సీఎంగా పదవీ ప్రమాణం చేయించాలని కూడా స్పష్టంగా అభ్యర్థించామని ప్రకటించింది. సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీవీకే 108 స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే. 234 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 118 స్థానాలు అవసరం కాగా.. విజయ్‌ పార్టీ 10 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్‌, పీఎంకే, వామపక్షాల మద్దతు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇంకోవైపు.. డీఎంకే పరాజయంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.


రాజీనామా లేఖను మంగళవారం ఈ-మెయిల్‌ ద్వారా పంపగా గవర్నర్‌ ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు పదవిలో కొనసాగాలని కోరారు. కాగా.. మంగళవారం టీవీకే కార్యాలయంలో భేటీ అయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు విజయ్‌ను ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం వారందరినీ విజయ్‌ మహాబలిపురం సమీపంలోని ఓ ప్రముఖ రిసార్ట్‌కు తరలించారు. గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తున్న ఆయన.. వారందరినీ రాజధానిలోనే ఉండాలని ఆదేశించారు. తమిళనాడు డీజీపీ, చెన్నై పోలీసు కమిషనర్‌ విజయ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై చర్చించారు.

కాంగ్రె్‌సతో టీవీకే పొత్తు ఖాయం?

ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల అవసరమైన నేపథ్యంలో ఇతర పార్టీల నేతలతో విజయ్‌ అండ్‌ కో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌(5), సీపీఎం(2), సీపీఐ(2), వీసీకే(2)లతో పాటు అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే(4)తో చర్చిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవులిస్తామని విజయ్‌ హామీ ఇవ్వడంతో అవి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. నేరుగా విజయ్‌కు ఫోన్‌ చేసి విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని విజయ్‌ మంగళవారం ‘ఎక్స్‌’లో తెలియజేశారు. రాహుల్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని ప్రచారం జరుగుతోంది. మంగళవారం సీపీఎం, సీపీఐ, వీసీకే, డీఎండీకే ఎమ్మెల్యేలు డీఎంకే కార్యాలయంలో స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉన్నారు. వీసీకే, పీఎంకే నడుమ రాజకీయ వైరం ఉన్నందున ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటే టీవీకే కూటమిలో చేరే అవకాశముంది.

విజయ్‌ మా మద్దతు కోరారు: కేసీ వేణుగోపాల్‌

తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్‌ కాంగ్రెస్‌ మద్దతు కోరారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ధ్రువీకరించారు. దీనిపై పీసీసీ నేతలు బుధవారం చెన్నైలో సమావేశమై తగిన నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానం సూచించినట్లు మంగళవారం సాయంత్రం ఆయన ఓ తమిళ చానల్‌కు తెలిపారు. కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌చార్జి గిరీశ్‌ చోడంకర్‌, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై నేతృత్వంలో పీసీసీ కార్యాలయంలోరాష్ట్ర కాంగ్రెస్‌ నేతల సమావేశం జరిగింది. టీవీకేతో పొత్తుపైనే ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం.

విజయ్‌తో ఈపీఎస్‌ మంతనాలు: లీమా రోస్‌

విజయ్‌ తమ మద్దతు కోరారని, దీనిపై తమ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎ్‌స)తో మంతనాలు జరుపుతున్నారని అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోస్‌ పేర్కొన్నారు. ఈపీఎ్‌సతో భేటీ అనంతరం ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. అయితే కొద్దిసేపటికే అన్నాడీఎంకే సీనియర్‌ నేత ఓఎస్‌ మణియన్‌ మాట్లాడుతూ.. టీవీకేకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని.. మద్దతు కోరుతూ ఈపీఎ్‌సతో ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. అయితే, బుధవారం జరిగే అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశంలో దీనిపై చర్చిస్తామన్నారు.


ధన ప్రవాహానికి సమాధి కట్టాం: విజయ్‌

తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన టీవీకేకు ప్రజల నుంచి లభించిన అఖండ మద్దతు దేశ రాజకీయాలనే కుదిపేసిందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యంలో ధన ప్రవాహానికి శాశ్వతంగా సమాధి కట్టామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి అందరూ తమను హేళన చేయడంతో పాటు తీవ్ర విమర్శలు గుప్పించారని, వాటిని పట్టించుకోకుండా ప్రజలపై విశ్వాసం ఉంచి ఎన్నికల్లో పోటీ చేశామని తెలిపారు. తమ నమ్మకం వమ్ముకాలేదని, రాష్ట్ర ప్రజానీకం గెలుపును బహుమతిగా అందజేసిందని తెలిపారు. టీవీకే అద్భుతమైన విజయానికి చిన్నారులు, బాలబాలికలు ప్రధాన కారకులయ్యారని, తమ కుటుంబ సభ్యులందరి దృష్టిని టీవీకే వైపు మళ్లించారన్నారు. చరిత్రాత్మక విజయానికి కారణమైన రాష్ట్ర ప్రజలకు, పార్టీ ప్రముఖులకు, గెలిచిన అభ్యర్థులకు ధన్యవాదాలు తెలిపారు. ఓట్లు వేసి గెలిపించిన ఆత్మీయులందరికీ ఽకృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

Updated Date - May 06 , 2026 | 07:21 AM