గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం తగదు
ABN , Publish Date - May 06 , 2026 | 07:34 AM
గవర్నర్ కోటాలో మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం కోదండరాంను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
అజారుద్దీన్, కోదండరాం నియామకాలపై పిటిషన్
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటాలో మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం కోదండరాంను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. వారిద్దరినీ ఎమ్మెల్సీగా నియమిస్తూ జారీ చేసిన జీవో 71 కు చట్టబద్ధత లేదంటూ షియా సివిల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టి్‌సకు చెందిన సయ్యద్ హైదర్ రజా నఖ్వీ హైకోర్టును ఆశ్రయించారు. కళలు, సాహిత్యం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారిని మాత్రమే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాల్సి ఉండగా.. అజారుద్దీన్, కోదండరాంల నియామకం ఇందుకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు. అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న కేసులు, చట్టపరమైన ఇతర అడ్డంకులను రాష్ట్ర ప్రభుత్వం సరిగా పరిశీలించలేదని పిటిషనర్ ఆరోపించారు. సామాజిక సేవకులను కాకుండా రాజకీయ నాయకులను ఎమ్మెల్సీలుగా నియమించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జీవో 71పై తక్షణం స్టే విధించడంతోపాటు రిట్ పిటిషన్‌లో తుది తీర్పు ఇచ్చే వరకు నామినీలు ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకోవాలని పిటిషనర్ కోరారు.