Share News

ఆగని అవినీతి.. రేటు కట్టి పౌర సేవలు

ABN , Publish Date - May 06 , 2026 | 08:10 AM

ఏసీబీకి పట్టుబడుతున్నా ట్రై కార్పొరేషన్ల పరిధిలో అవినీతి ఆగడం లేదు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలు.. భవన నిర్మాణ అనుమతులు, నివాసయోగ్య పత్రాల(ఓసీ) జారీ వరకు రేటు కట్టి పౌర సేవలందిస్తున్నారు.

ఆగని అవినీతి.. రేటు కట్టి పౌర సేవలు
Corruption, Govt Office

  • జనన, మరణ ధ్రువీకరణ పత్రం నుంచి భవన నిర్మాణ అనుమతి వరకు..

  • ట్రై కార్పొరేషన్ల పరిధిలో వింత పరిస్థితి

  • రూ.లక్ష తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్‌ అసిస్టెంట్‌

  • అవినీతిలో టౌన్‌ ప్లానింగ్‌ టాప్‌.. కమీషన్ల ఇంజనీరింగ్‌

  • ఇతర విభాగాల్లోనూ అదే తీరు

హైదరాబాద్‌ సిటీ: ఏసీబీకి పట్టుబడుతున్నా ట్రై కార్పొరేషన్ల పరిధిలో అవినీతి ఆగడం లేదు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలు.. భవన నిర్మాణ అనుమతులు, నివాసయోగ్య పత్రాల(ఓసీ) జారీ వరకు రేటు కట్టి పౌర సేవలందిస్తున్నారు. ఇక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో కమీషన్లు, ఘన, నిర్మాణ రంగ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన టిప్పింగ్‌ రుసుము చెల్లింపు, వన మహోత్సవం, చివరకు మహిళా పొదుపు సంఘాలకు రుణాల మంజూరులోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తప్పుడు లెక్కలు చూపి జీహెచ్‌ఎంసీ ఖజానాను కొందరు కొల్లగొడితే.. పారదర్శకంగా అందాల్సిన పౌర సేవలకు కొర్రీలు పెట్టి రూ.లక్షలు వసూలు చేసే వారు ఇంకొందరు. యూసుఫ్‏గూడ సర్కిల్‌లోని జూనియర్‌ అసిస్టెంట్‌ బీ శ్రీలత సోమవారం రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. భవన నిర్మాణ అనుమతి జారీ కోసం రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నఆమె మొదటి విడతగా రూ.లక్ష తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలో అవినీతి మరోసారి చర్చనీయాంశంగా మారింది.


టాప్‌లో పట్టణ ప్రణాళికా విభాగం

మూడు కార్పొరేషన్లలో పట్టణ ప్రణాళికా విభాగం అవినీతిలో టాప్‌. ఏసీబీకి వస్తున్న ఫిర్యాదుల్లోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది. భవన నిర్మాణ అనుమతులే కాదు.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ జారీకి కూడా ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక ఓసీల జారీ వసూళ్లు రూ.లక్షల్లోనే ఉంటాయని కొందరు చెబుతున్నారు. అనుమతి లేని భవన యజమానుల నుంచి చైన్‌మన్‌ మొదలు సర్కిల్‌ ఏసీపీ వరకు వసూలు చేసి వాటాలు తీసుకుంటున్నారు.


city1.jpgసీఎంసీ పరిధిలోని ఓ సర్కిల్‌లో నోటరీ స్థలంలో చేపడుతున్న భవనాల నుంచి భారీ మొత్తం వసూలు చేశారన్న ఫిర్యాదులు గతంలో అధికారులకు అందాయి. ఎంఎంసీలోని టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు కొందరిపై కమిషనర్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నీ సక్రమంగా ఉన్నా.. ఉన్నతాధికారొకరు కొర్రీలు పెట్టి దరఖాస్తుదారులను ఇబ్బంది పెడతారని ప్రచారంలో ఉంది. జీహెచ్‌ఎంసీలోని ఖైరతాబాద్‌ జోన్‌లోని ఓ సర్కిల్‌లో డాక్యుమెంట్లు సరిగా లేకున్నా ఓ భవనానికి అనుమతి ఇచ్చారన్న ఫిర్యాదు కేంద్ర కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు అందాయి.


కమీషన్ల ఇంజనీరింగ్‌

ఇంజనీరింగ్‌ విభాగంలోని పలువురు అధికారుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. బినామీ సంస్థలను ఏర్పాటు చేసి కొందరు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంఎంసీ పరిధిలో తార్నాకలోని కేంద్ర కార్యాలయ ఆధునికీకరణ మొదలు రోడ్లు, నాలాలు, ఇతరత్రా పనులకు సంబంధించి కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న ఓ అధికారి ఇష్టానికి వ్యవహరిస్తున్నాడని.. పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.


ఇదే కార్పొరేషన్‌ పరిధిలో ఓ కాంట్రాక్టర్‌ రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో పనుల నాణ్యత పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్‌ విభాగం అధికారులు బిల్లుల చెల్లింపులో కోత విధించారు. ప్రమాణాల ప్రకారం నాణ్యత లేదని రూ.2 లక్షలు మినహాయించాలని సూచించారు. అంతకుముందు అదే కాంట్రాక్టర్‌ నిర్మించిన సీసీ రోడ్డు పని పరిశీలన సందర్భంగా రూ.50 వేలు ముట్టచెబితే.. అంతా సక్రమంగా ఉన్నట్టు నివేదిక ఇవ్వడం గమనార్హం.


ఎల్‌బీనగర్‌ జోన్‌లో ఇంటి వద్ద జన్మించిన వ్యక్తికి (హోమ్‌ బర్త్‌) సర్టిఫికెట్‌ జారీ చేయగా.. సవరణ కోసం ఓ అధికారి రూ.25 వేలు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. ‘సంస్థలో పనిచేసే ఉద్యోగి నిర్ణీత మొత్తం చెల్లించగా.. పని పూర్తయినట్టు సమాచారం. పౌర సేవలు, అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప అవినీతి నియంత్రణ సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

విజయ్‌ డ్రైవర్‌ కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే

మూడు పార్టీలు.. ముగ్గురు ఎమ్మెల్యేలు!

Read Latest Telangana News and National News

Updated Date - May 06 , 2026 | 08:11 AM