జై కాంగ్రెస్.. జై సోనియా అంటే డబ్బులొస్తాయా?
ABN , Publish Date - May 06 , 2026 | 07:38 AM
‘‘జై శ్రీరాం అంటే డబ్బులు వస్తాయా? అని హిందువులను కించపరిచేలా మంత్రి సురేఖ వ్యాఖ్యలు చేయడం తగదు. జై కాంగ్రెస్, జై సోనియా, జై రాహుల్ గాంధీ అంటే డబ్బులు వస్తాయా?’’ అంటూ...
మంత్రి సురేఖ వ్యాఖ్యలు సిగ్గుచేటు: రఘునందన్
భక్తిని కూడా పైసలతో కొలుస్తారా?: ఎన్వీ సుభాష్
రామభక్తులకు సురేఖ క్షమాపణలు చెప్పాలి: వీహెచ్‌పీ
జనగామ రూరల్/హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): ‘‘జై శ్రీరాం అంటే డబ్బులు వస్తాయా? అని హిందువులను కించపరిచేలా మంత్రి సురేఖ వ్యాఖ్యలు చేయడం తగదు. జై కాంగ్రెస్, జై సోనియా, జై రాహుల్ గాంధీ అంటే డబ్బులు వస్తాయా?’’ అంటూ బీజేపీ ఎంపీ ఎం. రఘునందన్‌రావు ప్రశ్నించారు. జనగామలో ఆయన మాట్లాడుతూ.. హిందువుల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని, శ్రీరామ నామంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. రామున్ని నిందించిన కేజ్రీవాల్, దీదీ, దాదాలు దేశంలో అడ్రస్ లేకుండా పోయారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాకతీయ సామ్రాజ్యంలో కాషాయ జెండా ఎగురవేస్తామని, దానికి తొలి అడుగు ఈనెల 10న సికింద్రాబాద్‌లో నిర్వహించే సభ నిదర్శనమవుతుందని ఆయన చెప్పారు. భక్తిని కూడా పైసలతో కొలిచే నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఇటలీ సంస్కృతిలో పెరిగారు కాబట్టి ఆ పార్టీ నాయకులకు రామనామం విలువ తెలియదని విమర్శించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలను ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి సురేఖ వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని వీహెచ్‌పీ ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ, దేవుళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.