Share News

జేఎన్‏టీయూలో.. పరిశోధనలపై పట్టింపేదీ?

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:01 AM

ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది.

జేఎన్‏టీయూలో.. పరిశోధనలపై పట్టింపేదీ?
JNTU Hyderabad

  • ఏడాదిన్నరగా పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ వేయని జేఎన్‌టీయూ

  • క్యాంపస్‌ చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులు

హైదరాబాద్‌ సిటీ: ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ప్రతియేటా రెండు పీహెచ్‌డీ నోటిఫికేషన్లను జారీ చేస్తామని వివిధ సందర్భాల్లో వైస్‌ చాన్స్‌లర్‌ చేసిన ప్రకటనలు అధికారుల అలసత్వం కారణంగా అమలుకు నోచుకోవడం లేదని ఆయా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.


ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని చెప్పిన వర్సిటీ ఉన్నతాధికారులు ఆర్నెల్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదని ఆశావహ అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్‌ జారీచేసినా దరఖాస్తుల పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూల పేరిట అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాదికిపైగా అధికారులు సమయం తీసుకుంటుండడం ఆశావహ అభ్యర్థులను తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు గురిచేస్తోంది.


కొత్త నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూపులు

పీహెచ్‌డీ ప్రవేశాల నిమిత్తం ఈ ఏడాది (2026) నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేస్తారో ఎవరికీ అంతుబట్టడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకొని పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న పలువురు అభ్యర్థులు నోటిఫికేషన్‌ కోసం అడ్మిషన్ల విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీ అఫిలియేటెడ్‌ (ప్రైవేటు) ఇంజనీరింగ్‌ కళాశాలల్లో మూడేళ్ల క్రితమే రీసెర్చ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా కేంద్రాలకు అడ్మిషన్లలో ప్రాధాన్యతను ఇవ్వక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


city2.2.jpgవైస్‌ చాన్స్‌లర్‌ కిషన్‌కుమార్‌రెడ్డి.. ఈ ఏడాది ప్రారంభంలో ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో జరిపిన భేటీలో రానున్న నోటిఫికేషన్‌లో ప్రిన్సిపాల్స్‌కు సైతం స్కాలర్స్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, నోటిఫికేషన్‌ జారీపై అటు అర్‌అండ్‌డీ విభాగం నుంచి గానీ, ఇటు అడ్మిషన్ల విభాగం నుంచి గానీ స్పష్టమైన సమాచారం లేకపోవడంతో అభ్యర్థులు, ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపాల్స్‌ అయోమయానికి గురవుతున్నారు. పీహెచ్‌డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ వెంటనే జారీచేయాలని, అడ్మిషన్ల ప్రక్రియలో ప్రతీ దశకు నిర్ధిష్ట కాలపరిమితిని స్పష్టంగా పేర్కొనాలని, డెడ్‌లైన్‌లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు వైస్‌ చాన్స్‌లర్‌ను కోరుతున్నారు.


అడ్మిషన్ల ప్రక్రియలోనూ తీవ్ర జాప్యం

2024 జనవరిలో పీహెచ్‌డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, అడ్మిషన్ల ప్రక్రియ సకాలంలో పూర్తికాక పోవడంతో 40శాతం పైగా సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 1,031మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వివిధ దశల్లో నెలకొన్న జాప్యంతో వందలాది మంది అభ్యర్థులు ప్రైవేటు యూనివర్సిటీల బాట పట్టారు. 2025 ఏప్రిల్‌ నెలలో నోటిఫికేషన్‌ ఇవ్వగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావడానికి ఈ ఏడాది జనవరి వరకు (10నెలల)సమయం తీసుకున్నారు. ఓవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఔత్సాహికులను విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలని చెబుతున్నా, జేఎన్‌టీయూ అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

కూరగాయలు కాదు.. కాలకూట విషం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 11:01 AM