కూరగాయలు కాదు.. కాలకూట విషం
ABN , Publish Date - Aug 18 , 2026 | 06:41 AM
నిగనిగలాడుతూ కనిపించే కూరగాయలు, నోరూరించే పండ్లు.. మార్కెట్‌లో చూడగానే కొనేసి ఇంటికి తెచ్చేసుకుంటాం కదా... అలాంటి వాటిలో కాలకూట విషం నిండి ఉందంటే...
తెలంగాణ నుంచి 8,198 నమూనాలను పరీక్షిస్తే
486 శాంపిళ్లలో పరిమితికి మించి రసాయనాలు
3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 70,652 నమూనాల పరీక్ష
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పురుగు మందుల వాడకం
లోక్‌సభలో వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): నిగనిగలాడుతూ కనిపించే కూరగాయలు, నోరూరించే పండ్లు.. మార్కెట్‌లో చూడగానే కొనేసి ఇంటికి తెచ్చేసుకుంటాం కదా... అలాంటి వాటిలో కాలకూట విషం నిండి ఉందంటే నమ్ముతారా? విచ్చలవిడిగా పురుగు మందుల వాడకంతో పరిమితికి మించి రసాయన అవశేషాలు ఉన్నాయంటే నమ్మగలరా? ఆరోగ్యం సంగతి దేవుడెరుగు.. వాటిని తింటే అనారోగ్యం ఖాయమేనా? అంటే.. అవుననే అంటోంది కేంద్ర ప్రభుత్వం. అయా రాష్ట్రాల్లో పండ్లు, కూరగాయల సాగులో పురుగుమందుల వాడకంపై పూర్తి వివరాలను లోక్‌సభలోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2005-06 నుంచి జాతీయ స్థాయిలో పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణ ప్రాజెక్టును కేంద్రం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 2023 నుంచి 2026 వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన 70,652 పండ్లు, కూరగాయల నమూనాలను 40 అధునాతన ప్రయోగశాలల్లో పరీక్షించారు. ఇందులో 2,223 (3.1ు) నమూనాల్లో ఫుడ్ ేసఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఏఎ్‌సఐఏ) నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు తేలింది.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా..
దేశంలో అత్యధికంగా పురుగుమందులు వాడుతున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు సైతం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.. ఆహారపంటలు మొదలుకొని వాణిజ్య పంటల వరకు అన్నింటా విచ్చలవిడిగా రైతులు పోటీపడి మరీ పురుగుమందులు కొడుతున్నట్లు పేర్కొంది. కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం, తెలంగాణలో సేకరించిన 8,198 నమూనాల్లో 486 (5.92శాతం) శాంపిళ్లలో మోతాదుకు మించి పురుగుమందులు ఉన్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో 2,104 నమూనాలను పరీక్షించగా, అందులో 134(6.36శాతం) నమూనాల్లో అధిక రసాయన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. హరియాణాలో 2,371 నమూనాలు సేకరించగా..152 శాంపిల్స్‌లో అధిక రసాయనాలు ఉన్నట్లు వెల్లడైంది. ఏకంగా 6.41 శాతం మేర నమూనాల్లో అవశేషాలు ఉన్నట్లు గుర్తించగా, ఇది దేశంలోనే అత్యధికం కావడం గమనార్హం. కాగా, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల్లో ఒక్క నమూనాలోనూ మోతాదుకు మించి రసాయనాలున్నట్లు నమోదు కాలేదు.
సాగు మూలాల గుర్తింపు
రసాయనాల అవశేషాలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు ఏ తోట లేదా పొలం నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఎంపీఆర్‌ఎన్‌ఎల్ ప్రాజెక్టు కింద నమూనాలను సేకరించే స్థలం జీపీఎస్ కోఆర్డినేట్లను నమోదు చేయడం ద్వారా, పంట సాగు చేసిన ప్రాంతాన్ని సత్వరమే గుర్తించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. సమగ్ర సస్యరక్షణ, పురుగుమందుల పరిమిత వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచేందుకు 48 సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (సీఐపీఎంసీ) కేంద్రాల ద్వారా ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్స్, విత్తన శుద్ధి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అదనంగా నేషనల్ ప్యాక్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఇది పంటలకు పట్టిన తెగుళ్లను అప్పటికప్పుడే గుర్తించి, నివారణ మార్గాలను సిఫారసు చేస్తుంది. ఆహార భద్రతా చట్టం 2006 ప్రకారం ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ నిర్దేశించిన పరిమితికి మించి రసాయన అవశేషాలు ఉండే ఆహార పదార్థాలను అసురక్షితమైనవిగా పరిగణిస్తారని, ఈ ప్రాజెక్టును 2028-29 వరకు పొడిగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

జబ్బుల బారిన పడటం ఖాయం
పురుగుమందుల అవశేషాలున్న కూరగాయలు, పండ్లు తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘‘పురుగు మందుల అవశేషాల్లో కొన్ని తక్షణ ప్రభావం చూపితే.. మరికొన్ని దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయి. తక్షణ ప్రభావం చూపే రసాయనాలున్న కూరగాయలు, పండ్లు తీసుకుంటే కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట, తల తిరగడం, చర్మంపై దద్దుర్లు, దురద, కళ్లలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక, దీర్ఘకాలంలో ఆర్గానోఫాస్పేట్లు, క్లోరినేటెడ్ కాంపౌండ్స్ శరీరంలోకి వెళ్లడం వల్ల బ్లడ్ క్యాన్సర్, కాలేయ, పేగు, రొమ్ము కేన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలోని థైరాయిడ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి హర్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇన్‌ఫెర్టిలిటీ, డయాబెటిస్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పురుగుమందుల అవశేషాలను బయటకు పంపే క్రమంలో కిడ్నీలు, లివర్ తీవ్రంగా శ్రమించి కాలక్రమేణా దెబ్బతింటాయి’’అని పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా