స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా
ABN , Publish Date - Aug 17 , 2026 | 08:04 PM
మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థపై బాంబే హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థపై బాంబే హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి స్వీట్ షాపు లైసెన్స్‌ను పునరుద్ధరించడంలో జాప్యం జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. షాపు మూసి ఉండటంతో జరిగిన నష్టానికి గాను వారికి రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర ఎఫ్‌డీఏ అధికారులు ఇటీవల పుణెలోని గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పరిశుభ్రతకు సంబంధించి లోపాలు బయటపడ్డాయి. ఆ తరువాత షాపు వారు జులై 9న ఎఫ్‌డీఏ అధికారులను మరోసారి తనిఖీ చేయాలని కోరారు. నిబంధనలన్నిటినీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆ తరువాత నాలుగు రోజులకు ఎఫ్‌డీఏ అధికారులు మరోసారి తనిఖీ నిర్వహించారు. షాపు వారు నిబంధనల అమలు విషయంలో 98 శాతం పక్కాగా ఉన్నట్టు తేల్చారు. 36 మార్కులకు గాను 35 ఇచ్చారు.
అయితే, మునుపు రద్దు చేసిన లైసెన్స్‌ను మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో, షాపు వారు హైకోర్టును ఆశ్రయించారు. 34 రోజులుగా షాపు మూసి ఉండటంతో రూ.8.74 లక్షల నష్టం వచ్చిందని చెప్పారు. కస్టమర్లకు ఎలాంటి అనారోగ్యం కలిగిందనే విషయాన్ని లైసెన్స్ రద్దు ఆదేశాల్లో అధికారులు పేర్కొనలేదని అన్నారు. అయితే, షాపు యజమాన్యం అభ్యర్థనను పరిశీలించామని, నిర్ణయాన్ని ఆగస్టు 11కు వాయిదా వేశామని ఎఫ్‌డీఏ తరఫు లాయర్ పేర్కొన్నారు.
ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఎఫ్‌డీఏపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌డీఏ తీరు వింతగా ఉందని అభిప్రాయపడింది. కల్తీని కట్టడి చేయాలన్న ఎఫ్‌డీఏ తీరు అభినందనీయమే అయినా డిపార్ట్‌మెంట్ అతి చేస్తోందని కోర్టు అభిప్రాయపడింది. 98 శాతం కంప్లెయన్స్ ఉన్నప్పుడు వెంటనే లైసెన్స్‌ను పునరుద్ధరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. 30 రోజుల్లోపూ రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
మోదీ ప్రభుత్వం కోసం.. పోలీస్ జాబ్‌కు రాజీనామా!
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్