Share News

నేర్చుకున్న బడిలోనే బోధన

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:25 PM

ఒకప్పుడు ఆ తరగతి గదిలో బెంచ్‌పై కూర్చుని పాఠాలు విన్న అతను, నేడు అక్కడి బ్లాక్‌బోర్డ్‌ ముందు నిలబడి భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాడు.

నేర్చుకున్న బడిలోనే బోధన
School, student, teacher

  • చదువుకున్న స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా..

  • కొడకండ్ల పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచర్‌గా మోహన్‌రావు

గజ్వేల్‌(మెదక్): ఒకప్పుడు ఆ తరగతి గదిలో బెంచ్‌పై కూర్చుని పాఠాలు విన్న అతను, నేడు అక్కడి బ్లాక్‌బోర్డ్‌ ముందు నిలబడి భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాడు. తాను అక్షరాలు నేర్చుకున్న బడికే తిరిగి వచ్చి, బోధనామృతాన్ని అందిస్తున్న ఆ ఉపాధ్యాయుడి ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ గ్రామానికి చెందిన వేముల మోహన్‌రావు 1991-92 విద్యా సంవత్సరంలో కొడకండ్ల ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. పాఠశాల రోజుల్లో ఎదురైన కష్టాలను, అడ్డంకులను దాటి క్రమశిక్షణతో చదివి 1998లో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత 2009 డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లిష్)గా ఉద్యోగోన్నతి పొందారు.


mdk1.3.jpgసొంత పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచర్‌గా..

వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా సేవలు అందించిన వేముల మోహన్‌రావు, 2018 జూలై 9న తాను చదువుకున్న కొడకండ్ల ఉన్నత పాఠశాలలోనే స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లీష్‌ టీచర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎనిమిదేళ్లుగా ఇక్కడే విధులను నిర్వహిస్తూ, విద్యార్థులకు ఆంగ్ల బోధన చేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. ఒకప్పుడు తాను విద్యార్థిగా ఉండి జ్ఞానాన్ని పొందిన తరగతి గదుల్లోనే నేడు ఉపాధ్యాయుడిగా నిలబడి పాఠాలు చెప్పడం ఒక మధురానుభూతిని ఇస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా..

పిల్లలకు ఆంగ్లాన్ని సులువుగా అర్థమయ్యే రీతిలో బోధించేందుకు మోహన్‌రావు నిరంతర విద్యార్థిలా కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. తనను తీర్చిదిద్దిన గురువుల ఆశీస్సులు అందుకుంటూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. కష్టాలను పాఠాలుగా మారుస్తూ చదివిన పాఠశాల రుణం తీర్చుకుంటున్న ఆయన సేవలను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఎంతగానో అభినందిస్తున్నారు.


mdk1.jpgపీఎంశ్రీ సాధనలో కీలక పాత్ర

పాఠశాలకు పీఎం శ్రీ హోదా తీసుకురావడంలో మోహన్‌రావు తనవంతు సహకారాన్ని అందించారు. కొడకండ్ల ఉన్నత పాఠశాల తొలి దశలోనే పీఎంశ్రీ పాఠశాలగా ఎంపిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చదివిన పాఠశాలకే ఉపాధ్యాయుడిగా వచ్చి సేవ చేయడం, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడం తనకు ఎంతో తృప్తిని ఇస్తోందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కరువు పరిస్థితుల్లో.. కూరగాయల సాగుకు మొగ్గు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 12:25 PM