విశాఖ జూలో 128 కొత్త జీవాలు.. సిబ్బందికి పవన్ కల్యాణ్ అభినందనలు
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:01 PM
విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన మొత్తం 128 కొత్త జీవాలు జన్మనివ్వడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు.
అమరావతి, ఆగస్టు 25: విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన మొత్తం 128 కొత్త జీవాలు జన్మనివ్వడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రతి కొత్త జీవం మనలో కొత్త ఆశలు నింపుతుందని, ఒక జాతిని కాపాడటం అంటే ప్రకృతి సంపదను కాపాడుకోవటమే అని చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ పోస్ట్...
‘ప్రకృతి ఒడిలో కొత్త జీవం.. పరిరక్షణకు కొత్త బలం. విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో 12 రకాల జంతువులు, పక్షులు 128 కొత్త జీవాలకు జన్మనివ్వడం సంతోషకరమైన విషయం. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శాస్త్రీయ సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇది రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ చర్యలకు మరింత బలం చేకూరుస్తోంది. కృత్రిమ ఇంక్యుబేషన్ ద్వారా 10 ఎర్ర అడవి కోడి పిల్లలు, ఒక బ్లూ-గోల్డ్ మకావ్ పిల్లను విజయవంతంగా పొదిగించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ పునరుత్పత్తి ప్రక్రియలో భాగస్వాములైన అటవీ శాఖ అధికారులు, జూలాజికల్ పార్క్ సిబ్బంది, వెటర్నరీ బృందానికి హృదయపూర్వక అభినందనలు. ప్రతి కొత్త జీవం మనలో కొత్త ఆశలు నింపుతుంది. ఒక జాతిని కాపాడటం అంటే మన ప్రకృతి సంపదను కాపాడుకోవటమే. శాస్త్రసాంకేతికతను ఉపయోగిస్తూ జీవవైవిధ్యాన్ని భావితరాలకు అందించేలా ఆంధ్రప్రదేశ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
Read Latest AP News And Telugu News