డిసెంబర్ చివరి నాటికి క్వాంటం వ్యాలీ భవనం పూర్తి: మంత్రి నారాయణ
ABN , Publish Date - Aug 25 , 2026 | 10:13 AM
ఏపీ రాజధాని అమరావతిలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. క్వాంటం వ్యాలీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి.. పనుల పురోగతిని సమీక్షించారు.
అమరావతి, ఆగస్టు 25: ఏపీ రాజధాని అమరావతిలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. క్వాంటం వ్యాలీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి.. పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం టెక్నాలజీకి నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘క్వాంటం వ్యాలీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ను ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో అభివృద్ధి చేసిన విధంగానే క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. IBM, TCS తదితర సంస్థల భాగస్వామ్యంతో క్వాంటం ల్యాబ్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. 45,216 చదరపు అడుగుల్లో క్వాంటం వ్యాలీ భవనాన్ని నిర్మాణం చేస్తున్నామన్నారు. భవనం ప్రధాన నిర్మాణ పనుల్లో ఎక్కువ భాగం పూర్తయిందని.. క్వాంటం ల్యాబ్‌లో ‘రూమ్ వితిన్ రూమ్’ ప్రత్యేక డిజైన్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
బయటి శబ్దాలు, ట్రాఫిక్ శబ్దాలు ల్యాబ్‌ను ప్రభావితం చేయకుండా ప్రత్యేక శబ్ద నియంత్రణ సాంకేతికతను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. క్వాంటం చిప్‌లను సుమారు మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లబరచడానికి హీలియం కంప్రెసర్లు, క్రయోజెనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లను ఉపయోగించనున్నట్లు తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డ్యూయల్ యాక్టివ్ ఫీడర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ గ్రిడ్ నుంచి వచ్చే హార్మోనిక్స్, శబ్దాలను ఫిల్టర్ చేయడానికి K13 రేటెడ్ ఐసోలేషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నామన్నారు.
క్వాంటం వ్యాలీ భవనాన్ని డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నారాయణ తెలిపారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి MEP పనులు రాబోయే ఒకటి నుంచి రెండు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. IBMకు MEP పనులు చేపట్టేందుకు భవనాన్ని సెప్టెంబర్ 15న అప్పగిస్తామని తెలిపారు. క్వాంటం ల్యాబ్ పక్కన మొత్తం 50 ఎకరాల్లో రెండు భారీ టవర్లను నిర్మించనున్నట్లు చెప్పారు. రెండు టవర్లను ఒక్కొక్కటి 48 అంతస్తుల మేర సుమారు 202 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నట్లు తెలిపారు. మొత్తం విస్తీర్ణం సుమారు 37 లక్షల చదరపు అడుగుల్లో రెండు టవర్లను నిర్మిస్తామన్నారు. ఈ టవర్లలో స్టార్టప్‌లు, డెవలప్‌మెంట్ సంస్థలు, వివిధ టెక్నాలజీ కంపెనీలకు స్థలాన్ని కేటాయించనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ సైబర్ టవర్స్ తరహాలో మరింత మెరుగైన క్వాంటం టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా టవర్ల డిజైన్లను పరిశీలించి తుది రూపం ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేశ్ క్వాంటం వ్యాలీ ప్రాజెక్టును వ్యక్తిగతంగా కూడా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తామన్నారు. స్టార్టప్‌లు, పరిశ్రమలను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. క్వాంటం టెక్నాలజీ ఇంకా కొత్తదే కావడంతో ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్‌ను ఆంధ్రప్రదేశ్ తీసుకునే ప్రయత్నం చేస్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారుల అదృశ్యం.. గంటల వ్యవధిలోనే
బళ్లారి చేరుకున్న మంత్రి లోకేశ్.. పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన
Read Latest AP News And Telugu News