కరువు పరిస్థితుల్లో.. కూరగాయల సాగుకు మొగ్గు
ABN , Publish Date - Aug 25 , 2026 | 10:07 AM
ప్రస్తుత కరువు పరిస్థితుల్లో వరికి బదులు మెట్ట ప్రాంతమైన భీమదేవరపల్లి మండల రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు.
కరువు నేపథ్యంలో దృష్టిసారిస్తున్న రైతులు
లాభదాయకంగా ఉందంటున్న అన్నదాతలు
భీమదేవరపల్లి(హనుమకొండ): ప్రస్తుత కరువు పరిస్థితుల్లో వరికి బదులు మెట్ట ప్రాంతమైన భీమదేవరపల్లి మండల రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఎల్‌నీనో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వ్యవసాయ బావులు, బోర్ల లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. రైతులు వరికి బదులు కూరగాయలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ, ప్రభు త్వం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. దీంతో మండలంలోని పలు గ్రామాల రైతులు కూరగాయల సాగు చేపట్టారు.
టమాట, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, తదితర కూరగాయాలను సాగు చేస్తున్నారు. బీర, కాకరకాయలకు ఆశించిన మేర ధరలు పలుకుతుండడంతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. కూరగాయలను హనుమకొండ, వరంగల్, జమ్మి కుంట, హుజూరాబాద్ తదితర ప్రాంతాల మార్కెట్‌లకు తరలిస్తున్నారు. బీర, కాకరకాయ కిలో రూ.50వరకు ధర పలుకుతోంది.
అలాగే వంకాయ ధర కూడా ఆశించిన స్థాయిలో రైతులకు లాభాలు చేకూరుస్తోంది. కూరగాయల సాగుతో ఎకరా వరికి పెట్టే నీరు రెండెకరాల కూరగాయల సాగును చేపట్టవచ్చని రైతులు పేర్కొంటున్నారు. అలాగే కూరగాయల సాగుకు డ్రిప్ పద్ధతిన వాడడంతో నీరు ఆదా అవుతోంది. ఈ ఖరీప్ సీజన్‌లో సాగు చేసిన కూరగాయల పంటలు మరో రెండు నెలల పాటు రైతులకు పండుతాయి. వరితో పోలిస్తే కూరగాయలు లాభదాయకంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
లాభదాయకంగా కూరగాయల సాగు
సంగం సదానందం, రైతు, కొప్పూర్
కూరగాయల సాగు లాభదాయకంగా ఉంది. నేను ఈ ఖరీఫ్‌లో బీర, కాకర, వంకాయ, సొర కాయ లాంటి కూరగాయాలను సాగు చేస్తున్నా ను. బీర, కాకర, వంకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో సొరకాయ రూ. 10నుంచి 20వరకు ధర పలుకుతోంది. వరితో పోల్చుకుంటే కూరగా యల సాగు ద్వారా లాభాలు పొందవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత పైకి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News