Share News

ఆ ప్రచారాన్ని నమ్మొద్దు

ABN , Publish Date - Aug 25 , 2026 | 05:47 AM

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల తేదీలు, షెడ్యూల్‌ అంటూ వాట్సాప్‌ ద్వారా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఆ ప్రచారాన్ని నమ్మొద్దు

  • స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై వాట్సా్‌పలో తప్పుడు సమాచారం

  • ప్రజలను తప్పుదోవపట్టించేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు

  • అధికారిక ప్రెస్‌నోట్‌ లేదా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారానే వెల్లడి

  • రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ

అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల తేదీలు, షెడ్యూల్‌ అంటూ వాట్సాప్‌ ద్వారా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇలాంటి ధ్రువీకరణ లేని సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఇతరులకు షేర్‌ చేయవద్దని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు, షెడ్యూల్‌ అంటూ ప్రజలను తప్పుదోవపట్టించే సమాచారం వాట్సాప్‌ ద్వారా ప్రచారం అవుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. ఎన్నికల సంఘం/సంబంధిత శాఖ పేరుతో అధికారిక చిహ్నాలను అనధికారికంగా ఉపయోగించి ఈ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రచారంలో ఉన్న సమాచారం వాస్తవమా? కాదా? అనే విషయంపై వివరణ కోరుతూ వివిధ వర్గాల నుంచి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని పేర్కొంది. ఇది వాస్తవం కాదని, అధికారిక ధ్రువీకరణ లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కావాలనే ప్రజలను తప్పుదోవపట్టించే సమాచారాన్ని సృష్టించి, ప్రచారం చేసి, ఇతరులకు చేరవేసే వ్యక్తులపై సైబర్‌ చట్టాలు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికలకు సంబంధించిన నిజమైన, అధికారిక సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రెస్‌నోట్‌ లేదా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాత్రమే ప్రజలకు తెలియజేస్తుందని స్పష్టం చేసింది. అనధికార వర్గాలు, సోషల్‌ మీడియా ద్వారా వెలువడే సమాచారాన్ని అధికారికమైనదిగా పరిగణించరాదని సూచించింది. ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ధ్రువీకరించిన అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది.

Updated Date - Aug 25 , 2026 | 05:50 AM