పాఠశాలల్లోనూ నకిలీ ఫైర్ ఎన్‌ఓసీల దందా.. హైడ్రాకు ఫిర్యాదులు
ABN , Publish Date - Oct 08 , 2026 | 09:51 AM
నకిలీ అగ్నిమాపక నిరభ్యంతర పత్రాలు(ఫైర్ ఎన్‌ఓసీ) సమర్పించిన ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల బాగోతం మరవక ముందే మరో తతంగం బయటపడింది.
నాడు ఇంటర్ కళాశాలలు..ఇప్పుడు పాఠశాలలు
నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలతో తప్పుదోవ
చందానగర్‌లోని ఓ పాఠశాల సమర్పించినట్టు గుర్తింపు
హైడ్రాకు ఫిర్యాదు.. నిజమని తేల్చిన అధికారులు
మరిన్ని పాఠశాలలపైనా అనుమానం..?
గతంలో నకిలీ ఎన్‌ఓసీలు సమర్పించిన 53 ఇంటర్ కళాశాలలు
హైదరాబాద్ సిటీ: నకిలీ అగ్నిమాపక నిరభ్యంతర పత్రాలు(ఫైర్ ఎన్‌ఓసీ) సమర్పించిన ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల బాగోతం మరవక ముందే మరో తతంగం బయటపడింది. ఈసారి పాఠశాలల వంతు. తామేం తక్కువ కాదన్నట్టు పలు పాఠశాలల యాజమాన్యాలు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించాయి. హైడ్రా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి తయారు చేసిన సర్టిఫికెట్లను బోర్డుకు సమర్పించినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. చందానగర్‌లోని ఓ పాఠశాల యాజమాన్యం నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ సమర్పించినట్టు ఫిర్యాదు రాగా.. హైడ్రా అధికారులు విచారణ జరిపారు.
సదరు పాఠశాల యాజమాన్యం సమర్పించిన సర్టిఫికెట్ నకిలీదని తేలింది. మరో నాలుగు పాఠశాలలకు సంబంధించిన ఫైర్ ఎన్‌ఓసీల పైనా ఫిర్యాదులు అందినట్టు సమాచారం. దీంతో స్పందించిన హైడ్రా.. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు బుధవారం లేఖ రాసింది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని పాఠశాలలు సమర్పించిన ఫైర్ ఎన్‌ఓసీల వివరాలు ఇవ్వాలని కోరింది. హైడ్రా కమిషనర్ సంతకాలు చందానగర్‌లోని పాఠశాల యాజమాన్యం ఫోర్జరీ చేసిన నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ లేక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గతంలో ఇంటర్ కళాశాలలు
గతంలో ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు నకిలీ ఎన్‌ఓసీలు సమర్పించిన తతంగం చర్చనీయాంశంగా మారింది. నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలపై జూన్‌లో ఉప్పందడంతో హైడ్రా తీగ లాగగా డొంక కదిలింది. క్యూర్ పరిధిలోని 142 కళాశాలల ఫైర్ ఎన్‌ఓసీలు పరిశీలించగా.. 53 పత్రాలు నకిలీవని తేలింది. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఈవీడీఎం, ఫైర్ సర్వీసెస్ విభాగం అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. గతంలో ఈవీడీఎంలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు ఇంటర్మీడియట్ కళాశాల యాజమాన్యాలకు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.
నిబంధనల ప్రకారం ప్రతియేటా విద్యాశాఖకు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఫైర్ ఎన్‌ఓసీ సమర్పించాలి. ఈ నేపథ్యంలో అగ్నిమాపక ఏర్పాట్లు పూర్తి స్థాయిలో లేని విద్యాసంస్థలు నకిలీ ఎన్‌ఓసీల సమర్పణకు మొగ్గు చూపుతున్నాయి. నకిలీ ఎన్‌ఓసీల తతంగం బయటపడడంతో హైడ్రా వెంటనే అప్రమత్తమైంది. విద్యాసంస్థలు సమర్పించే ఎన్‌ఓసీలు అసలైనవా..? నకిలీవా..? అని పరిశీలించేలా ఇంటర్మీడియట్ బోర్డుకు హైడ్రా యాక్సెస్ ఇచ్చింది. సంస్థ జారీ చేసిన ఎన్‌ఓసీల వివరాలను బోర్డు అధికారులు పరిశీలించే అవకాశం ప్రస్తుతం ఉంది. దీంతో నకిలీ దందాకు చెక్ పెట్టవచ్చని ఉన్నతాధికారులు తెలిపారు. క్యూర్ పరిధిలో వేల సంఖ్యలో పాఠశాలలు ఉన్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపితే ఎన్ని నకిలీ ఎన్‌ఓసీలు సమర్పించారన్నది తేలనుంది.
ఎన్‌ఓసీలను గుర్తించేదెలా?
క్యూర్ పరిధిలో వేల సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చాలా పాఠశాలలకు సరైన భవనాలు ఉండవు. ఇక అగ్నిమాపక ఏర్పాట్లు ఎక్కడా కనిపించవు. ఈ నేపథ్యంలో పలు పాఠశాలల యాజమాన్యాలు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పణకు మొగ్గు చూపుతున్నాయి. ఇంకొందరు ఆయా విభాగాల్లోని కింది స్థాయి సిబ్బందిని ఆశ్రయించి ఎన్‌ఓసీలు పొందుతున్నారు. పాఠశాలల యాజమాన్యాలు సమర్పిస్తున్న ఎన్‌ఓసీలు సరైనవా.? కాదా..? అన్నది పరిశీలించే వ్యవస్థ ఇప్పటి వరకు ఎస్‌ఎ్‌ససీ బోర్డు వద్ద లేదు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న పాఠశాలలు ఇష్టానికి నకిలీ ఎన్‌ఓసీలు సమర్పిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు బోర్డు ఉద్యోగులూ యాజమాన్యాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఓటును హరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై 12న ఓవర్‌సైట్ కమిటీ భేటీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News